ఐశ్వర్యారాయ్‌తో పోలిక సరే.. ప్రియాంక చోప్రా, మానుషి చిల్లర్ సంగతేంటి: డయానా హెడెన్
మాజీ ప్రపంచ సుందరి డయానా హెడెన్‌పై త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైనాయి. డయానా హెడెన్‌కు అసలు ప్రపంచ సుందరి కిరీటాన్ని ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. పూర్వం భారతీయ మహి
మాజీ ప్రపంచ సుందరి డయానా హెడెన్‌పై త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైనాయి. డయానా హెడెన్‌కు అసలు ప్రపంచ సుందరి కిరీటాన్ని ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. పూర్వం భారతీయ మహిళలు సౌందర్య సాధనాలను, షాంపూలను ఉపయోగించలేదని, మట్టి రుద్దుకొని స్నానం చేసేవారన్నారు. అంతేగాకుండా మెంతి నీళ్లతో జుట్టును శుభ్రం చేసుకునేవారని గుర్తు చేశారు.
కానీ అందాల పోటీ నిర్వాహకుల మాఫియా మన దేశంలోకి చొచ్చుకువచ్చిందని.. వీధి వీధికి బ్యూటీ పార్లర్ వచ్చేసిందని.. అందాల పోటీల్లో మోడల్స్ ధరించే దుస్తులపై కూడా బిప్లవ్ మండిపడ్డారు. భారతీయ మహిళలకు ప్రతిరూపమైన ఐశ్వర్యారాయ్‌కు ప్రపంచ సుందరి కిరీటం ఇచ్చారంటే అర్థం వుంది కానీ.. డయానా హెడెన్‌కు ఏం చూసి టైటిల్ ఇచ్చారో అర్థం కావట్లేదని బిప్లవ్ కుమార్ అన్నారు.
అయితే బిప్లవ్ కుమార్ దేవ్ వ్యాఖ్యలపై డయానా హెడెన్ స్పందించారు. ఆయన వ్యాఖ్యలు సిగ్గుచేటని, చామనఛాయ ఉన్నందుకు గర్వపడాల్సింది పోయి, తక్కువచేసి మాట్లాడటం తనను బాధించిందన్నారు. తెల్లని చర్మ రంగుకు ప్రాధాన్యమిచ్చే సంకుచిత మనస్తత్వంపై తాను చిన్నప్పట్నుంచే పోరాడుతున్నట్లు చెప్పారు.
భారతీయ చామనఛాయ ఔన్నత్యాన్ని తాను ప్రపంచానికి చాటితే మెచ్చుకోవాల్సింది పోయి విమర్శలు చేయడం విడ్డూరమని డయానా హెడెన్ మండిపడ్డారు. ప్రపంచస్థాయి అందాల పోటీలో నెగ్గి, గౌరవ ప్రతిష్టలు దేశానికి తీసుకొస్తే అభినందించాల్సింది పోయి విమర్శించడం ఎందుకని అత్యంత గౌరవప్రదమైన, ప్రతిష్ఠతో కూడిన టైటిల్‌నూ, ప్రశంసలను దేశానికి తీసుకొస్తే అభినందించకుండా విమర్శించడం ఏమిటన్నారు.
ఐశ్వర్యరాయ్‌తో పోల్చారు సరే.. అంతకుముందు అదే టైటిల్ సాధించిన ప్రియాంకా చోప్రాతోగానీ, ఇటీవల ఆ కిరీటం పొందిన మానుషి చిల్లర్‌తోగానీ ఎందుకు పోల్చలేదని డయానా హెడెన్ ప్రశ్నించారు. భారతీయులు చామనఛాయ ఉన్నందుకు గర్వపడాలని చెప్పారు. సమాజంలో ఉన్న చర్మవర్ణ వివక్ష కారణంగా ఆత్మన్యూనతకు గురవుతూ వచ్చానని, దానిపై పోరాడాల్సి వచ్చిందన్నారు. అయితే బిప్లవ్ కుమార్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పుకున్నారు.