స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తయారయ్యే తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అయ్యిందనే వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనానికి దారి తీసింది. ఆ కల్తీకి పశువుల కొవ్వు, చేప నూనె, పంది కొవ్వు వంటివి కూడా ఉపయోగించారని సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం, అందుకు సాక్ష్యంగా
గుజరాత్‌లోని నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) ల్యాబ్ రిపోర్టును విడుదల చేయడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. గత ప్రభుత్వ హయాంలో మార్చిన టెండర్ నిబంధనలు, నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ పొందిన సంస్థల్లో తమిళనాడుకు చెందిన "ఏఆర్ ఫుడ్స్" సరఫరా చేసిన నెయ్యిలో ఈ కల్తీ జరిగిందని ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం చెబుతోంది.
ఇదంతా అబద్ధమని, టీటీడీకి సరఫరా చేసే నెయ్యిని పరీక్షించి నాణ్యత లేదని తేలితే వెనక్కి పంపించేలా అక్కడ ఏర్పాట్లు ఉన్నాయని, కల్తీ నెయ్యిని వినియోగించలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.
అయితే ఈ లడ్డూ వివాదం సుప్రీం వరకు వెళ్లింది. విశిష్టత కల్గిన స్వామి వారి లడ్డు ప్రసాదం విషయంలో నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిందేనని హిందూ సమాజం డిమాండ్ చేస్తోంది. కొందరు ఏకంగా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి పిటిషన్లు కూడా దాఖలు చేశారు.
అలా దాఖలైన 5 పిటిషన్లలో కొన్నింటిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు వాటిని సోమవారం (సెప్టెంబర్ 30) నాటి విచారణ జాబితాలో చేర్చింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరపనుంది.