సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలోభాగంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా చివరి దశ ఎన్నికల ప్రచారం కోసం ఆమె సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఆమె సోమవారం కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆమె నడుచుకున్న తీరు, ప్రదర్శించిన హూందాతనంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఆమె కాన్వాయ్ వెళుతున్న సమయంలో కొంతమంది బీజేపీ కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోడీకి అనుకూలంగా నినాదాలు చేశారు.
దీంతో తన కారును ఆపి.. భద్రతా సిబ్బందితో కలిసి ఆమె బీజేపీ కార్యకర్తల వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. ఆమె సంయమనంతో చిరునవ్వులు చిందిస్తూ వారి వద్దకెళ్లి కరచాలనం చేశారు. "మీరు మీ పని చూసుకోండి.. నా పని నేను చేసుకుంటా.. ఆల్ ది బెస్ట్" అని ప్రియాంక అన్నారు.
సాధారణంగా రాజకీయ నేతలు తమ ప్రత్యర్థులకు మద్దతుగా నినాదాలిచ్చిన వారిపై రెచ్చిపోవడం చూస్తుంటాం. కానీ, ప్రియాంక అందుకు భిన్నంగా ఎంతో సంస్కారవంతంగా ప్రవర్తించడం స్థానికుల్ని ఆకట్టుకుంది.
కాగా, ఆమె సోమవారం ఇండోర్‌లో రోడ్ షో నిర్వించారు. ఈ సందర్భంగా ప్రియాంకా గాంధీ రోడ్‌షోను తిలకించేందుకు స్థానికులు భారీ సంఖ్యలో రోడ్డుకు ఇరువైపులా నిల్చొని ఆమెకు స్వాగతం పలికారు. రోడ్‌షోలో అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న ప్రియాంక.. మధ్యలో కొంత మంది మోడీ అనుకూల నినాదాలు చేయడంతో ఆమె హుందాతనంగా నడుచుకోవడంతో మోడీ ఫ్యాన్స్‌తో పాటు దేశ ప్రజలు కూడా ఫిదా అయిపోయారు.