Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముగిసిన ములాయం 'అమర' బంధం..

ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో ములాయం శకం ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో మరో బాంబు పేలింది. అది సమాజ్ వాదీ పార్టీలో ముసలం కంటే షాక్ ఇచ్చిన బాంబు. ఎస్పీ కుటుంబ గొడవలతో విసిగిపోయిన అమర్ సింగ్ బీజేపీ తీర్థ పుచ్చుకోవడానికి సిద్దపడిపోయారు.

ముగిసిన ములాయం 'అమర' బంధం..
హైదరాబాద్ , బుధవారం, 18 జనవరి 2017 (05:31 IST)
ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో ములాయం శకం ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో మరో బాంబు పేలింది. అది సమాజ్ వాదీ పార్టీలో ముసలం కంటే షాక్ ఇచ్చిన బాంబు. ఎస్పీ కుటుంబ గొడవలతో విసిగిపోయిన అమర్ సింగ్ బీజేపీ తీర్థ పుచ్చుకోవడానికి సిద్దపడిపోయారు. వీలైనంత త్వరగా తన కొత్త బంధం ప్రకటిస్తానని మీడియాకు తెలిపారు కూడా. అవును. నిజంగానే ములాయం ఇప్పుడు పూర్తిగా ఓడిపోయారు. ఒక్క మాట చెప్పాలంటే ఇన్నాళ్లూ దగ్గరున్నా, దూరం జరిగినా తనను అంటిపెట్టుకుని ఉన్న తన ఛాయ ఇప్పుడు తెగతెంపులకు సిద్ధమై ఎదిరిపక్షం గూటిలోకి వెళ్లనుంది. ఇప్పుడు యూపీ రాజకీయాల్లో కొత్త ట్యాగ్.. "ముగిసిన అమర ప్రేమ"
 
ఆ పెద్దాయన తన మిత్రుడిని ప్రేమించినంతగా కన్నకొడుకును కూడా అంతగా  ప్రేమించి ఉండరు. ఎందుకంటే అంత గొప్ప వ్యూహకర్తను ఆయన తన జీవితంలోనే చూడలేదు. ఎన్ని అడ్డంకులను అతడు తనను అవలీలగా కాపాడాడో ఎలా మరవగలడు. జైలు శిక్ష నుంచి ములాయం సింగ్ యాదవ్‌ను కాపాడినా, నేతాజీకి ఢిల్లీ రాజకీయాల ఓనమాలు దిద్దించినా, బిల్ క్లింటన్ నుంచి బడా పారిశ్రామికవేత్తలను యూపీకి రప్పించినా, సినిమా స్టార్లతో సమాజ్ వాదీకి మరింత గ్లామర్ అద్దినా అది ఒక్క అమర్ సింగ్ ఘనతేనని నేతాజీ(ములాయం) బలంగా నమ్ముతారని పార్టీ ప్రముఖులు చెబుతారు. అందుకే కన్న కొడుకును సైతం కాదని ములాయం.. అమర్ సింగ్ పై అమర ప్రేమను ప్రకటిస్తారని అంటారు. అసలు వీళ్ల దోస్తీ ఎలా మొదలైంది
 
'రాజకీయాల్లో రాసి కంటే వాసి ముఖ్యం' అనుకుంటే సమాజ్ వాదీ పార్టీలో అమర్ సింగ్ కంటే గొప్ప(!) వ్యూహకర్త లేరు.  అప్పటికే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న ములాయం జనతాపార్టీ ప్రతినిధిగా 1985లో యూపీ శాసన మండలి ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఆ సమయంలోనే ములాయంకు యూపీలో బలమైన రాజ్‌పుత్ సామాజిక వర్గానికి చెందిన అమర్ సింగ్ పరిచయం అయ్యారు. 1989లో ములాయం మొదటిసారి (జనతాదళ్ నుంచి)ముఖ్యమంత్రి అయిన తర్వాత అమర్-ములాయంకు మరింత దగ్గరయ్యారు. పరివార్ నుంచి విడిపోయి ములాయం 1992లో సొంతగా సమాజ్ వాదీ పార్టీ స్థాపించినప్పుడూ అమర్ సింగ్ వెంటే ఉన్నారు. 96లో అధికారికంగా పార్టీలో చేరిన అమర్ సింగ్.. కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ (1996-98) ఏర్పాటయినప్పుడు సమాజ్ వాదీ పార్టీ తరఫున కీలక పాత్ర పోషించారని సీనియర్లు చెబుతారు.
 
ధారాళమైన ఇంగ్లీష్, స్వచ్ఛమైన హిందీలో అనర్గళంగా మాట్లాడే అమర్ సింగ్.. రక్షణ శాఖ మంత్రిగా పనిచేస్తోన్న ములాయంకు అన్నీ తానై వ్యవహారాలన్నీ చక్కబెట్టేవారు. ఆ సమయంలో యూపీలో పార్టీ పగ్గాలన్నీ అమర్ సింగ్ చేతుల్లో ఉండేవి. 2003లో ములాయం మరోసారి యూపీ సీఎంగా గద్దెనెక్కినప్పుడు యూపీ డెవలప్ మెంట్ కౌన్సిల్ చైర్మన్ హోదాలో అమర్ సింగ్.. పారిశ్రామికవేత్తలకు యూపీ ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరిచారు. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, జయప్రద, రాజ్ బబ్బర్ సహా పలువురు బాలీవుడ్ స్టార్లను సమాజ్ వాదీలో చేర్పించింది కూడా అమర్ సింగే. ఎప్పటికైనా ప్రధానమంత్రి కావాలనే కోరిక అమర్ సింగ్ వ్యూహాలతో తప్పక నెరవేరుతుందని ములాయం బలంగా నమ్మేవారని, ఇప్పటికీ ఆ నమ్మకాన్ని వీడలేదని నేతాజీ కీలక అనుచరులు చెబుతారు.
 
అలా వర్థిల్లుతోన్న వారి స్నేహం 2009లో అఖిలేశ్ యాదవ్ సీఎంగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కుదుపులకు గురైంది. బయటి వ్యక్తిని తండ్రి(ములాయం) అతిగా నమ్ముతున్నారని అఖిలేశ్ పలుమార్లు బహిరంగంగా వ్యాఖ్యానించారు. అఖిలేశ్ సీఎం పగ్గాలు చేపట్టడంతో ఆయన ఖాళీ చేసిన ఫిరోజాబాద్ పార్లమెంట్ స్థానంలో భార్య డింపుల్ యాదవ్ పోటీకి దింపారు. అది రుచించని అమర్ సింగ్.. డింపుల్ కు వ్యతిరేకంగా ఎస్పీ తిరుగుబాటు అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. ఫలితం అఖిలేశ్ కు అనుకూలంగా రావడం, ఆ వెంటనే తండ్రిని ఒప్పించి అమర్ సింగ్‌పై వేటువేయడం చకచకా జరిగిపోయాయి.
 
ఆరేళ్ల బహిష్కరణా కాలాన్ని పూర్తిచేసుకున్న అమర్ సింగ్ 2016లో సమాజ్ వాదీ పార్టీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. సరిగ్గా కొడుకు చరిష్మా ముందు ములాయం స్టార్డమ్ వెలిసిపోతున్న తరుణంలోనే ములాయంకు అమర్ తోడయ్యారు.. తన ప్రియ స్నేహితుడికి పూర్వవైభవం కల్పించడంతోపాటు (ప్రధాని కావాలనే)పాతకలలను నిజం చసే బాధ్యతను అమర్ తలకెత్తుకున్నారు. ఈ క్రమంలో ఎన్ని ఒడుదుడుకులు, తీవ్రస్థాయి విమర్శలకు గురైనా అమర్ 'స్నేహం కోసం' ఎంతకైనా వెళతానని ములాయం తేల్చిచెప్పారు.
 
కానీ తన రాక తండ్రీ కొడుకుల మధ్య ఇంత చిచ్చు రేపుతుందని ఊహించని అమర్ సింగ్ తన మిత్రుడిని కన్నకొడుకే మూలన పడేయటంతో విసిగిపోయారు. యూపీ ఎన్నికలు ముగిసేవరకు లండన్‌లోనే ఉంటానని ప్రకటించి సోమవారమే బయలుదేరిన అమర్ సింగ్ ఉన్నట్లుండి బీజేపీలో చేరిక గురించి ప్రకటించడం అన్ని రాజకీయ పక్షాలనూ కుదిపేసింది. రాజకీయ సమీకరణాలను అమాంతంగా మార్చి వేసిన ఈ ప్రకటన మూడు దశాబ్దాల పైబడిన అమర ప్రేమకు కూడా మంగళం పలికేసింది.
 
అమిత బాధకు గురైనప్పుడు  ఆకలి రాజ్యం సినిమాలో కమల్ హసన్ పాడుకున్న ఆ శ్రీశ్రీ గీతం మళ్లీ ఒక్కసారి గుర్తు వస్తోంది.
 
ఏది సత్యం, ఏదసత్యం, ఏది నీతి ఏది నేతి..
ఓ మహాత్మా,, ఓ మహర్షీ..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డోనాల్డ్ ట్రంప్ చాలా మంచోడు.. ఆందోళన అక్కర్లేదు : సత్య నాదెళ్ల