మధ్యప్రదేశ్ అశోక్ నగర్ జిల్లాలో ఫోన్ సిగ్నల్ కోసం మంత్రి ఏకంగా 50 అడుగుల ఎత్తైన జెయింట్ వీల్‌ను ఎక్కారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. డిజిటల్ ఇండియా అంటూ ఊదరగొట్టే ప్రభుత్వంలో సిగ్నల్ కోసం మంత్రి ఈవిధంగా జెయింట్ వీల్ ఎక్కారంటూ పలు మీమ్స్ స్క్రోల్ అయ్యాయి.
పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ మంత్రి బ్రజేంద్ర సింగ్ యాదవ్ ఆదివారం అమ్ఖో గ్రామంలో ఏర్పాటు చేసిన 'భగవద్ కథా' అనే ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చుట్టూ కొండలతో ఉన్న ఈ ప్రాంతంలో ఫోన్ సిగ్నల్స్ సరిగా అందలేదు. దీంతో మంత్రి 50 అడుగుల ఎత్తైన జెయింట్ వీల్ ఎక్కి ఫోన్ మాట్లాడారు.
ఈ ఫొటో స్థానిక వార్తాపత్రికలో ప్రచురితం కావడంతో వైరల్‌గా మారింది. స్థానిక సమస్యలపై పలువురు మంత్రికి మెమోరాండం సమర్పించేందుకు వచ్చినప్పటికీ.. మంత్రి పట్టించుకోకుండా ఫోన్ సిగల్స్ కోసం తిరుగుతండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫొటోపై మంత్రి బ్రజేంద్ర సింగ్ స్పందించారు. తాను ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం ఉన్నతాధికారులతో మాట్లాడేందుకు యత్నించానని అన్నారు.