పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య మరో వివాదం రాజుకుంది. ఎల్జీ, సీఎం మధ్య హెల్మెట్ చిచ్చు పెట్టింది.
ముఖ్యమంత్రి జరిమానా కట్టి తీరాల్సిందేనని గవర్నర్ పట్టుబడుతున్నారు. ముఖ్యమంత్రినే జరిమానా కట్టమంటారా అని సీఎం ఫైరవుతున్నారు. సీఎం అయినా పీఎం అయినా నిబంధనలు పాటించాల్సిందేనని ఎల్జీ తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఈ గొడవ పుదుచ్చేరీలో హాట్ టాపిక్‌గా మారింది.
కామరాజనగర్ ఉప ఎన్నికల చివరి రోజు కాంగ్రెస్ కార్యకర్తలు ఓ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో ముఖ్యమంత్రి నారాయణస్వామి పాల్గొన్నారు. ఐతే, హెల్మెట్ పెట్టుకోకుండానే హోండా స్కూటర్ నడిపారు. ఆ ఫోటో మీడియాలో వచ్చింది.
అది చూసిన లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, మోటారు వాహనాల చట్టాన్ని ముఖ్యమంత్రి ఉల్లంఘించారని పేర్కొన్నారు. సీఎంపై కేసు నమోదు చేసి జరిమానా వసూలు చేయాలని డీజీపీని ఆదేశించారు. సీఎంపై కేసు పెట్టాలంటూ డీజీపీని ఎల్జీ ఆదేశించడం తీవ్ర కలకలం రేపింది.
కిరణ్‌బేడీ తీరుపై నారాయణస్వామి భగ్గుమన్నారు. కిరణ్‌బేడీ స్కూటర్‌పై వెళ్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసి, హెల్మెట్ విషయంలో ఒకరికి సలహా చెప్పేటప్పుడు పాటించి చూపించాలని చురకలు వేశారు.
ఐతే, ఆ ఫోటో విషయంలో నారాయణస్వామి తప్పులో కాలేశారు. స్కూటర్‌పై వెళ్తున్న సమయంలో కిరణ్ బేడీ వెనక కూర్చొని ఉన్నారు. బైక్‌పై వెనక కూర్చున్నవాళ్లు హెల్మెట్ పెట్టుకోవాలని చట్టంలో లేదని, సీఎంకు ఈ మాత్రం కూడా అవగాహన లేదా అని కిరణ్ బేడీ విరుచుకుపడ్డారు.
దాంతో సీఎం క్యాంపు సైలెంట్ అపోయింది. ఐతే, గవర్నర్ మాత్రం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ముఖ్యమంత్రి నుంచి కచ్చితంగా జరిమానా వసూలు చేయాలని స్పష్టం చేశారు.