సంక్రాంతి వచ్చిందంటే తమిళనాడులో జల్లికట్టు పోటీలు జోరుగా సాగుతాయి. ఈ ఏడాది కరోనా కలవరపెడుతున్నా.. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్నా.. తమిళ తంబీలు బెదురు లేకుండా జల్లికట్టు పోటీల్లో పాల్గొంటున్నారు. పాలమేడు, తిరుచ్చి, అవనీయపురంలో కోడెగిత్తలు రంకెలేస్తున్నాయి. యువకులపై కొమ్ములతో విరుచుకుపడుతున్నాయి.
మదురై జిల్లాలోని అవనియాపురం గ్రామంలో పెద్ద ఈలలు, కరతాళ ధ్వనులు, హర్షధ్వనుల మధ్య, జల్లికట్టు ప్రాంగణంలోకి 300 ఎద్దులను బయటకు పంపారు. తమిళనాడు ప్రభుత్వం 300 ఎద్దులు మరియు 150 మంది ప్రేక్షకులతో జల్లికట్టును అనుమతించింది.
ఇక పొట్లగిత్తల దూకుడుతో పలువురికి గాయాలవుతున్నా యువకులు ఏమాత్రం బెదురుకు గురికాలేదు. రంకెలు వేసే బసవన్నల పొగరును అణచివేస్తున్నారు. తమ పౌరుషాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎద్దును లొంగదీసుకునేందుకు వందలాది యువకులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
కానీ ఎవరడ్డు వచ్చినా సరే ఆ రింగులో తిరుగుతూ కొమ్ములతో పొడిచేస్తున్నాయి... ఎద్దులు. మొదలైన కాసేపటికే కొంతమంది యువకులకు గాయాలయ్యాయి. ఇక శుక్రవారం మధురై జిల్లాలో జల్లికట్టులో యువకుడి మృతి చెందారు. మరో 80 మంది గాయపడ్డారు. దీంతో పోటీలకు దగ్గరలో మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు అధికారులు. ప్రాణాలను గాయాలను ఏమాత్రం లెక్కచేయకుండా యువకులు భారీ స్థాయిలో జల్లికట్టులో పాల్గొంటున్నారు.