దేశంలో రోజు రోజుకీ కరోనా ఉధృతి పెరిగిపోతోంది. తమిళనాడు, మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా నియంత్రణకు తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
లాక్‌డౌన్ గడువు శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎడప్పాడి కే పళనిస్వామి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
అలాగే ప్రతీ ఆదివారం పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించనుండగా.. మిగిలిన రోజుల్లో కొన్నింటిని సడలింపులు ఇవ్వడం జరిగింది. అంతరాష్ట్ర రవాణాపై నిషేధం కొనసాగనుంది. అంతర్‌జిల్లా ప్రయాణానికి ఈ-పాస్ తప్పనిసరి చేసింది.
పార్కులు, బీచ్‌లు, సినిమాహాళ్లు, విద్యాసంస్థల బంద్ కొనసాగుతుందని తెలిపింది. తమిళనాడులో ప్రస్తుతం 57వేల కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 1.7లక్షలకు పైగా కరోనా బాధితులు కోలుకున్నారు. కరోనా బారినపడి 3,471 మంది మరణించారు.