తమిళనాడు మాజీ సీఎస్ తనయుడి చుట్టు బిగుస్తున్న ఉచ్చు...
తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి పి.రామ్మోహన్ రావు కుమారుడు వివేక్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వివేక్‌కు సంబంధించిన పలు అక్రమాస్తుల వివరాలను ఆదాయపన్ను శాఖ అధికారులు గుర్తించారు.
తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి పి.రామ్మోహన్ రావు కుమారుడు వివేక్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వివేక్‌కు సంబంధించిన పలు అక్రమాస్తుల వివరాలను ఆదాయపన్ను శాఖ అధికారులు గుర్తించారు. ఇటీవల రామ్మోహన్‌రావు, వివేక్‌ల నివాసాల్లో సోదాలు జరిపి గుట్టు రట్టు చేయడం, ముఖ్యంగా తిరువాన్మియూరులోని వివేక్ నివాసంలో అనేక కీలక పత్రాలను, దస్తావేజులను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
వీటిని పరిశీలించిన ఐటీ అధికారులు.. వివేక్ పలు అక్రమాలకు పాల్పడినట్లు అంచనాకు వచ్చారు. ఇందుకు తన తండ్రి అధికారాన్ని ఉపయోగించినట్లు భావిస్తున్నారు. బెంగుళూరులో వివేక్ 500 లగ్జరీ ఫ్లాట్లను కొనుగోలు చేసినట్లు, తన స్నేహితుడు భాస్కర్ నాయుడుతో కలిసి బెంగుళూరులోనే ఒక ఆస్పత్రిని, ఔట్ సోర్సింగ్ కంపెనీని ప్రారంభించినట్లు సమాచారం.
ఈ ఆస్పత్రికి కావాల్సిన పారిశుద్ధ్య కార్మికులు, ఇతర సహాయక సిబ్బందిని ఈ కంపెనీ ద్వారా ఔట్‌సోర్సింగ్ విధానంలో ఎంపిక చేస్తున్నట్లు గుర్తించారు. ప్రభుత్వ వైద్యశాఖ ద్వారా వివేక్ రూ.300 కోట్ల మేరకు కాంట్రాక్టులు పొందినట్లు కనుగొన్నారు. భాస్కర్ నాయుడుతో కలిసి పలు చోట్ల కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
దీంతో ఆయన పెట్టుబడులు, ఇతర ఆస్తుల కొనుగోలుకు సంబంధించి విచారించేందుకు ఈ నెల 24న విచారణకు హాజరు కావాలని వివేక్‌కు ఐటీ శాఖ సమన్లు జారీ చేసింది. ఆయన మాత్రం తన భార్య అనారోగ్యంతో ఉందని, విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని కోరడం గమనార్హం.