Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీజేపీ శాసించింది... పన్నీర్ పాటించాడు. కాళ్లబేరం తప్పని పళని

నా మాటే శాసనం అంటూ తమిళనాడు రాజకీయాలను ఏకచ్చత్రాధిపత్యంతో నడిపిన జయలలిత అనూహ్యంగా మరణించాక తమిళనాడు భవిష్యత్తు చిత్రపటం కల్లోకూడా ఊహించని మార్పులతో అల్లాడిపోయింది. నామమాత్రపు ఉనికి కూడా లేని బీజేపీ తమ

బీజేపీ శాసించింది... పన్నీర్ పాటించాడు. కాళ్లబేరం తప్పని పళని
హైదరాబాద్ , గురువారం, 20 ఏప్రియల్ 2017 (05:07 IST)
ఒక మహావృక్షం ఉన్నట్లుండి కుప్పకూలిపోయినప్పుడు ఒక రాష్ట్ర భవిష్యత్తు ఎలా తారుమారవుతుందో వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్య మరణానంతర పరిణామాలు తేటతెల్లం చేశాయి. నా మాటే శాసనం అంటూ తమిళనాడు రాజకీయాలను ఏకచ్చత్రాధిపత్యంతో నడిపిన జయలలిత అనూహ్యంగా మరణించాక తమిళనాడు భవిష్యత్తు చిత్రపటం కల్లోకూడా ఊహించని మార్పులతో అల్లాడిపోయింది. నామమాత్రపు ఉనికి కూడా లేని బీజేపీ తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పే మహర్దశను ఇంత తక్కువ కాలంలో అనుభవించగలదని రెండు నెలల క్రితం ఎవరైనా ఊహించారా?


"మా ఉద్దేశం అర్థమైందికదా. ఇక రెండు వైరి వర్గాలూ కలిసిపోయి సజావుగా పాలన చేయండి" అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అటు సీఎం పళనిస్వామికి, ఇటు ప్రత్యర్థి పన్నీర్ సెల్వంకి హిత బోధచేశారంటేనే తమిళనాడులో బీజేపీ వేసిన పాగా ఎంత బలమైనదో అర్థమవుతుంది.ఇంకా ఘోరమేమిటంటే అమ్మ కనుసన్నలలో మెలిగిన అన్నాడీఎంకే పార్టీ తల్లిలని పిల్లల్లా బేలగా మారిపోయి వచ్చే ఎన్నికల్లో బీజేపీకి సగం సీట్లు కట్టబెట్టడానికి అంగీకరించాల్సిన దుస్థితిని ఎవరు ఊహించారు? తమిళనాడు రాజకీయాల్లో ఇంత వైపరీత్యంలాంటి పరిణామాలు ఎలా జరిగాయి?
 
జయ మరణం తర్వాత రాష్ట్ర ప్రజల్లో సాత్వికుడు, నీతిపరుడు అనే విశ్వాసం పొందిన పన్నీర్ స్వామితో తొలినుంచి జత కట్టడమే బీజేపీ దిశను మార్చివేసింది. జయలలిత నీడన ఉంటూనే ఆమెకు ఎసరు పెట్టిన శశికళను మొదటి నుంచీ నమ్మని బీజేపీ అధినాయకత్వం వ్యూహాత్మకంగా పన్నీర్ సెల్వంకి మద్దతు నివ్వడమే కొన్ని నెలల వ్యవధిలో ఆ పార్టీకి తమిళనాడులో అఖండ బలాన్ని సాధించిపెట్టింది.  అమ్మ జయలలిత సమాధి వేదికగా రెండు నెలల కిందట చిన్నమ్మ శశికళపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఒ.పన్నీర్‌సెల్వం తన పోరాటంలో గెలుస్తున్నట్లు కనిపిస్తోంది. శశికళ ఆధిపత్యాన్ని సవాల్‌ చేసిన ఓపీఎస్‌ అంతిమ విజయం సాధించినట్లు తమిళనాడు ప్రజలు భావిస్తుండవచ్చు. 
 
నిజానికి ఈ నాటకీయ పరిణామాలన్నిటికీ సూత్రధారి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీయేనని.. ఢిల్లీలోని కమలనాథుల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం అంతా నడుస్తోందని.. కాబట్టి వాస్తవమైన విజేత బీజేపీయే అవుతుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ ప్రోద్బలం ప్రోత్సాహం లేకుండా ఓపీఎస్‌ తిరుగుబాటు చేసేవారు కాదని.. ఒకవేళ చేసినా ఆ పార్టీ అండదండలు లేనిదే ఈ విజయం సాధించగలగటం సంగతి తర్వాత.. ఇంతకాలం తిరుగుబాటు నేతగా మనగలగడం కూడా సాధ్యం కాదని ఆ వర్గాలు ఉద్ఘాటిస్తున్నాయి.
 
ఆర్‌.కె.నగర్‌ ఉప ఎన్నిక వాయిదాకు కారణమైన ఓట్ల కొనుగోలు వ్యవహారం గానీ.. కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఎన్నికల చిహ్నం కోసం ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు గానీ.. రెండూ కేంద్ర సంస్థలే బయటపెట్టడంలో ఏదో మతలబు ఉందనేది తమిళనాడులోని శశికళ వర్గం రాజకీయ నాయకులే కాదు, పలువురు రాజకీయ పరిశీలకుల సందేహం. నిజానికి ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభానికి గురిచేయడం కొత్త విషయం కాకపోయినా.. ఆర్‌.కె.నగర్‌ ఉప ఎన్నికలో అది అసాధారణ స్థాయిలో సాగడం.. దానిపై ఈసీ తదితర కేంద్ర సంస్థలు తీవ్రంగా స్పందించడం సరైన చర్యే అయినా.. దాని వెనుక ఏవైనా రాజకీయ శక్తులు పనిచేసి ఉండొచ్చనే అంశాన్ని కొట్టి వేయలేమని వారు అంటున్నారు. 
 
ఆర్‌.కె.నగర్‌ ఉప ఎన్నిక విషయంలో పరిణామాలు, దినకరన్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయడం తదితర పరిణామాలు.. శశికళ వర్గానికి కేంద్రం నుంచి వచ్చిన పరోక్ష హెచ్చరికగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. శశికళ కుటుంబాన్ని దూరం పెట్టి.. ఓపీఎస్‌తో రాజీపడి పార్టీని కలిపేయాలన్నది ఆ హెచ్చరిక సారాంశంగా చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో శశికళ గ్రూపులోని చాలా మంది నాయకులు కూడా ఆమె కుటుంబానికి విధేయతను కొనసాగిస్తే.. తమపైనా ‘దాడులు, సోదాలు’ జరుగుతాయని.. మొత్తంగా పార్టీయే కూలిపోయే పరిస్థితి రావచ్చని ఆందోళన చెందున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓపీఎస్‌తో చేతులు కలపడం మినహా ప్రత్యామ్నాయం లేదని.. అది జరగాలంటే ఓపీఎస్‌ షరతులు విధించినట్లు శశికళ, దినకరన్‌లను దూరం పెట్టకతప్పదని పరిశీలకులు వివరిస్తున్నారు
 
అన్నా డీఎంకేలో అంతర్గత సంక్షోభంతో ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. ‘‘బీజేపీలో చేరడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. వారు మాతో టచ్లో ఉన్నారు’’ అని రాష్ట్రంలో పరిణామాలను నిశితంగా గమనిస్తున్న బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ తమిళనాడు వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధర్రావు ఇటీవల మీడియాతో పేర్కొన్నారు. బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ తన 92 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఇటీవల తమిళనాడులోని కోయంబత్తూరులో అత్యున్నత స్థాయి ప్రతినిధుల సభ సమావేశాన్ని నిర్వహించడం కూడా.. ఈ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు దోహదపడే వ్యూహంలో భాగమేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోదీ చెబితే కానీ 'బుగ్గ'లకు సెలవు చెప్పరా? ఒక్క దెబ్బతో వీవీఐపీ కల్చర్ ఔట్