Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియురాలి కోసం అమ్మాయి వేషంలో ప్రియుడు.. చివరకు జైలుపాలయ్యాడు...

Advertiesment
Surat
, బుధవారం, 27 మే 2020 (18:48 IST)
లాక్డౌన్ కష్టాలు అన్నీఇన్నీకావు. కొందరివి ఆకలి కష్టాలు అయితే, మరికొందరివి ప్రేమ కష్టాలు. ఇంకొందరివి ఉపాధి కష్టాలు. ఏది ఏమైనా ఈ లాక్డౌన్ ప్రతి ఒక్కరినీ అష్టకష్టాలు పెడుతోంది. గత మార్చి 25వ తేదీ నుంచి లాక్డౌన్ అమల్లోవుంది. దీంతో ఓ ప్రియుడు తన ప్రియురాలి ఎడబాటును తట్టుకోలేకపోయాడు. అంతే.. ఎలాగైనా ప్రియురాలితో కలిసి మాట్లాడాలని ఓ నిర్ణయానికి వచ్చాడు. ఇందుకోసం అమ్మాయి వేషం వేశాడు. అయితే, ఓ చోట పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. కానీ మరో చోటమాత్రం పోలీసులకు చిక్కిపోయాడు. ఫలితంగా జైలుపాలయ్యాడు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సూరత్ నగరానికి చెందిన ఓ యువతీ యువకుడు గాఢంగా ప్రేమించుకున్నారు. లాక్డౌన్‌కు ముందు వీరిద్దరూ ప్రతి రోజూ కలుసుకుని మాట్లాడుకునేవారు. అయితే, లాక్డౌన్ వీరిద్దరి మధ్య ఎడబాటు పెంచింది. రెండు నెలలపాటు ప్రియురాలిని చూడలేక పోయాడు. దీంతో ప్రియుడికి పిచ్చెక్కినట్టు అయింది. 
 
ఇంకా చూడకుండా ఉండడం తన వల్ల కాదనుకున్నాడు. ఆమెను ఎలాగైనా కలవాలని నిర్ణయించుకున్నాడు. అయితే, అబ్బాయిలనైతే పోలీసులు పట్టుకుంటారని అనుమానించాడు. దీంతో అమ్మాయిలా మారిపోవాలనుకున్నాడు. పంజాబీ డ్రెస్ ధరించి, తలకు దుపట్టా చుట్టుకున్నాడు. ఫేస్ మాస్క్ పెట్టుకుని బైక్‌పై నిన్న తెల్లవారుజామున 2.40 గంటల ప్రాంతంలో రయ్‌మంటూ దూసుకుపోయాడు. 
 
ఓ ప్రాంతంలో పోలీసులు ఉన్నా అమ్మాయే అని భ్రమపడి అడ్డుకోలేదు. కానీ మరో ప్రాంతంలో మాత్రం దొరికిపోయాడు. అతడిని అడ్డుకున్న పోలీసులు వేళకాని వేళలో ఎక్కడికి వెళ్తున్నావని ప్రశ్నించారు. అయితే, మాట్లాడితే దొరికిపోతానని భావించిన యువకుడు.. చేతితో సంజ్ఞలు చేశాడు.
 
దీంతో అనుమానించిన పోలీసులు దుపట్టా తీసి మాట్లాడాలని కోరారు. తప్పని పరిస్థితుల్లో దుపట్టా తీయడంతో అతడి బండారం బయటపడింది. పోలీసులు, అమ్మాయి తల్లిదండ్రులు తనను గుర్తించకుండా ఉండేందుకే ఇలా అమ్మాయి వేషం ధరించినట్టు చెప్పుకొచ్చాడు. విస్తుపోయిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంగళగిరి తెదేపా ప్రధాన కార్యాలయానికి కరోనా నోటీసులు!