ప్రజలు ఆవేశంలో ఉన్నారు... అల్లర్లు జరగొచ్చు.. తస్మాత్ జాగ్రత్త కేంద్రానికి సుప్రీం స్పష్టీకరణ
రద్దు చేసిన పెద్ద నోట్లను మార్పిడి చేసుకునేందుకు అనేక ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రజలు ఆవేశంలో ఉన్నారనీ, అందువల్ల అల్లర్లు జరగొచ్చని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. అదేసమయంలో
రద్దు చేసిన పెద్ద నోట్లను మార్పిడి చేసుకునేందుకు అనేక ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రజలు ఆవేశంలో ఉన్నారనీ, అందువల్ల అల్లర్లు జరగొచ్చని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. అదేసమయంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై దాఖలయ్యే పిటిషన్లను తీసుకోవద్దంటూ హైకోర్టులను తాము నిలువరించలేమని తేల్చి చెప్పింది.
ఆ నిర్ణయంతో ప్రజలు చాలా తీవ్రంగా ప్రభావితులయ్యారని, పరిస్థితి అల్లర్లకు దారితీసే సమయంలో కోర్టు ద్వారాలను మూసివేయలేమని వ్యాఖ్యానించింది. బ్యాంకులు, పోస్టాఫీసుల బయట ప్రజలు పెద్ద పెద్ద క్యూల్లో నిలబడటం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వాటి నివారణకు చర్యలు తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేసింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈనెల 7వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో 8వ తేదీ నుంచి పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లు చెల్లకుండా పోయాయి. ఈ నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీం కోర్టు మినహా మరే ఇతర కోర్టులోనూ పిటిషన్లు దాఖలు కాకుండా చూడాలంటూ కేంద్రం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అన్ని పిటిషన్లనూ సుప్రీం కోర్టే విచారించాలని కోరింది.
ఈ పిటీషన్‌పై సుప్రీం చీఫ్ జస్టిస్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ ఏఆర్ దవేలతో కూడిన ధర్మాసనం శుక్రవారం దాని విచారణ చేపట్టింది. "ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో చూడండి. ప్రజలు హైకోర్టులకు వెళ్లాల్సిందే. హైకోర్టులకు వెళ్లకుండా మేం వారిని అడ్డుకుంటే, సమస్య తీవ్రత మాకు ఎలా తెలుస్తుంది!? ప్రజలు హైకోర్టులకు ఉపశమనం కోసమే వెళతారు. ఇది తీవ్రమైన అంశం. వాళ్లను కింది కోర్టులకు వెళ్లనివ్వండి. ప్రజలు వివిధ కోర్టులకు వెళ్లడం సమస్య తీవ్రతను తెలియజేస్తుంది. కేంద్ర నిర్ణయంతో ప్రజలు ప్రభావితులయ్యారు. ప్రజలు ఆవేశంలో ఉన్నారు. దాడులు కూడా జరగొచ్చు. కోర్టులను ఆశ్రయించే హక్కు వారికి ఉంటుంది" అని స్పష్టం చేసింది.