దేశంలో ప్రఖ్యాత పర్యావరణ వేత్తగా గుర్తింపు పొందిన చిప్కో ఉద్యమకారుడు సుందర్‌లాల్ బహుగుణ మృతి చెందారు. ఈయన ప్రాణాలను కూడా కరోనా వైరస్ తీసింది. ఈయనకు వయసు 94 యేళ్లు.
రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో ఆయన కోవిడ్ చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 12.05 నిమిషాలకు బహుగుణ తుదిశ్వాస విడిచినట్లు ఎయిమ్స్ డైరక్టర్ రవికాంత్ తెలిపారు. కరోనా పాజిటివ్ తేలడంతో మే 8వ తేదీన ఆయన్ను హాస్పిటల్‌లో చేర్పించారు. గత రాత్రి ఆయన పరిస్థితి విషమించింది. ఆక్సిజన్ లెవల్ చాలా వరకు పడిపోయింది. ఇన్నాళ్లూ ఐసీయూలో ఆయన సీపీఏపీ థెరపీలో ఉన్నారు.
కాగా, ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ ప్రాంతంలో ఉన్న మరోడా ఆయన స్వగ్రామం. 1974లో ఆయన చిప్కో ఉద్యమాన్ని ప్రారంభించారు. చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. చాలా శాంతియుతంగా ఆయన ఆ ఉద్యమాన్ని సాగించారు.
ఉత్తరాఖండ్‌లో నిర్మించిన తెహ్రీ డ్యామ్‌కు వ్యతిరేకంగా కూడా ఆయన పోరాటం చేశారు. పర్యావరణవేత్త సుందర్‌లాల్ బహుగుణ మృతిపట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. శతాబ్ధాలుగా ప్రకృతితో సహజీవనం చేసే మన జీవిన విధానానికి బహుగుణ తార్కాణమన్నారు.
సుందర్‌లాల్ మృతి దేశానికి భారీ నష్టమని, తీరని లోటు అని అన్నారు. ఆయన మృదుస్వభావాన్ని ఎన్నటికీ మరవలేమన్నారు. బహుగుణ కుటుంబసభ్యులకు, ఆయన్ను ఇష్టపడేవారికి ప్రధాని మోడీ సానుభూతి వ్యక్తం చేస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు.