మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి అని చెప్పడానికి ఈ ఘటన మరో ఉదాహరణగా నిలిచింది. తనపై అత్యాచారం చేసాడని పేర్కొంటూ ఓ మహిళ(21) పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. పాలక్కడ్ జిల్లాలోని చేరుప్లాస్సెరీ ప్రాంతంలో గల అధికార సీపీఐ(ఎం) ఏరియా కమిటీ కార్యాలయంలో తనపై ఈ అఘాయిత్యం చేటుచేసుకుందని పేర్కొంది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గడిచిన శనివారం నాడు రోడ్డు పక్కన అప్పుడే పుట్టిన ఆడ శిశువును పోలీసులు గుర్తించారు. ఈ విషయంపై దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు శిశువు తల్లి ఆచూకీ కనుగొన్నారు. ఆమెను విచారించగా ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘానికి చెందిన ఓ కార్యకర్త పార్టీ ఆఫీసులో తనపై 10 నెలల క్రితం అత్యాచారానికి పాల్పడ్డట్టుగా వెల్లడించింది. కాలేజీ మ్యాగజైన్‌ను రూపొందించే నిమిత్తం పార్టీ ఆఫీస్‌కు వెళ్లగా ఈ దారుణం చోటుచేసుకున్నట్లు తెలిపింది. అత్యాచారం కారణంగా మహిళ ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది.
ఈ విషయంపై స్థానిక సీపీఐ(ఎం) నాయకుడు స్పందిస్తూ సదరు మహిళ ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్త అని తెలిపారు. ఆమె కుటుంబం సైతం పార్టీతో చాలా దగ్గరి సంబంధాలను కలిగి ఉందన్నారు. పార్టీ పరంగా విచారణ చేపట్టినట్లు చెప్పారు. కాగా దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత రమేష్ చెన్నితల స్పందిస్తూ.. సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయాలు అత్యాచార కేంద్రాలుగా తయారయ్యాయని విమర్శించారు. కేరళలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.