కేరళలో పోలీసులకే కష్టమొచ్చింది. కేరళలోని ఇడుక్కి జిల్లా కుంబుమెట్టు పోలీస్ స్టేషన్ పోలీసులకు కోతులు చుక్కలు చూపిస్తున్నాయి. పదుల సంఖ్యలో కోతులు వచ్చి.. పోలీస్ స్టేషన్‌పై దాడి చేస్తున్నాయి. కేరళ-తమిళనాడు సరిహద్దులో ఈ పోలీస్ స్టేషన్ ఉంటుంది.
చుట్టూ దట్టమైన అడవి ఉండడంతో కోతులు పెద్ద సంఖ్యలో అక్కడికి వస్తున్నాయి. గుంపులు గుంపులుగా వచ్చి.. పోలీస్ స్టేషన్‌లోకి వచ్చి రచ్చరచ్చ చేస్తున్నాయి. ఎన్నిసార్లు వెళ్లగొట్టినా మళ్లీ మళ్లీ వచ్చేవి. అలాంటి సమయంలో ఓ రైతు ఇచ్చిన అద్భుతమైన సలహాతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
అతడు ఇచ్చిన సూచనలతో పోలీసులు విచిత్రమైన మార్గాన్ని ఎంచుకున్నారు. పోలీస్ స్టేషన్ చుట్టూ రబ్బరు పాములను పెట్టారు. స్టేషన్ గోడలు, గేట్లు, గ్రిల్స్‌తో పాటు చుట్టు పక్కల ఉన్న చెట్లపై చైనా పాములను ఉంచారు.
వాటితో కోతులను భయపెట్టే ప్రయత్నం చేశారు. చివరకు ఈ ఎత్తుగడ ఫలించింది. రబ్బరు పాములను చూసి.. కోతులు భయపడిపోతున్నాయి. నిజమైన పాములుగా భావించి హడలిపోతున్నాయి. ఆ పాములు కనిపిస్తే.. వెంటనే అక్కడి నుంచి పారిపోతున్నాయి. అలా పోలీసులకు కోతుల బెడద తప్పింది. దీంతో పోలీసులు హాయిగా తమ పని తాము చేసుకుపోతున్నారు.