రైళ్లలో పొగతాగే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. రైలు బోగీల్లో పొగతాగితే జైలు శిక్ష విధించాలని చూస్తోంది. ఆ దిశగా ఓ చట్టాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
గత వారం ఢిల్లీ - డెహ్రాడూన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలకు తాగి పడేసిన సిగరెట్ లేదా బీడీయే కారణమై ఉంటుందని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ పొగతాగే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.
ఈ నెల 13న ఢిల్లీ-డెహ్రాడూన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. సీ-4 బోగీలో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధం అయింది. సమాచారం అందుకున్న సిబ్బంది వెంటనే మంటలు ఆర్పివేశారు.
అయితే షార్ట్‌సర్క్యూటే ప్రమాదానికి కారణమని తొలుత భావించారు. కానీ, బాత్‌రూంలో ఉన్న చెత్తకుండిలో ఎవరో తాగిపడేసిన సిగరెట్ లేదా బీడీ పీక వల్లే ప్రమాదం సంభవించిందని ప్రాథమిక విచారణలో తేలింది.
దీంతో రైళ్ళలో పొగతాగేవారిని గుర్తించి అవసరమైతే జైలుకు కూడా పంపేందుకు వెనుకాడొద్దని భావిస్తోంది. రైళ్లలో సిగరెట్లు, బీడీలు తాగడం అంటే ప్రజా ఆస్తుల్ని ధ్వంసం చేయడమేనని అభిప్రాయపడింది.