కరోనా లాక్డౌన్ తరువాత దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు మూసివేశారు. కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి తర్వాత చాలా పాఠశాలలు ఆన్‌లైన్ తరగతుల ద్వారా పాఠాలు చెపుతున్నాయి. సాంకేతికతపై అతిగా ఆధారపడటం వల్ల ప్రతికూలమైన ఫలితాలు కూడా వస్తున్నాయి. తాజాగా పూణేలో జరిగిన ఒక సంఘటన దీనికి ఉదాహరణ.
రాజగురునగర్‌లో ఉన్న ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో టీచర్ విద్యార్థులకు ఆన్‌లైన్ వీడియో చాట్ ప్లాట్‌ఫామ్ జూమ్ ద్వారా ఆన్‌లైన్ క్లాస్ ప్రారంభించారు. కానీ ఆమె ఆన్‌లైన్ లింక్ షేర్ చేయగానే అశ్లీల వీడియో క్లిప్ ప్రత్యక్షమైంది. అభ్యంతరకరమైన వీడియో తెరపైకి రావడంతో విద్యార్థులు చాట్ బాక్స్ ద్వారా టీచర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన గురించి విద్యార్థులు తమ తల్లిదండ్రులకు కూడా తెలియజేశారు.
ఈ సంఘటన తర్వాత చాలామంది విద్యార్థులు ఆన్‌లైన్ క్లాస్‌ను నిలిపివేశారు. కానీ ఈ విషయం తెలియని టీచర్ తన ఉపన్యాసాన్ని కొనసాగించింది. అయితే, మరుసటి రోజు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపాల్‌ను కలవడానికి వెళ్లి అధికారికంగా ఫిర్యాదు చేశారు.
సైబర్ నేరగాళ్ల ట్యాంపరింగ్ ఫలితంగా ఈ ఘటన జరిగిందని పాఠశాల నిర్వాహకులు తెలిపారు. ఈ ఘటనపై తమకు పూర్తి అవగాహన ఉందని, విచారణ జరుపుతున్నామని విద్యాశాఖాధికారి సంజయ్ తెలిపారు. సైబర్ నేరస్థుడు హ్యాకింగ్ ద్వారా దుశ్చర్యకు పాల్పడినట్లు పాఠశాల పేర్కొంది.