Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాంగ్రెస్ కి ఝలక్: మోదీకి జై కొట్టిన జ్యోతిరాదిత్య సింధియా, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మద్దతు

Advertiesment
కాంగ్రెస్ కి ఝలక్: మోదీకి జై కొట్టిన జ్యోతిరాదిత్య సింధియా, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మద్దతు
, బుధవారం, 7 ఆగస్టు 2019 (08:32 IST)
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జమ్మూకశ్మీర్ విభజన బిల్లు కాంగ్రెస్ పార్టీని ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. జమ్ముకశ్మీర్ విభజన బిల్లు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కల్లోలం నెలకొంది. 
 
ప్రత్యర్థి పార్టీ బీజేపీ బిల్లు పాస్ చేసే పనిలో ఉంటే కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి. కేంద్ర నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీకి సొంత పార్టీ నేతలు వరుసగా షాక్ లపై షాక్ లు ఇస్తున్నారు. 
 
ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దు వంటి అంశాలను బాహాటంగానే కాంగ్రెస్ నేతలు సమర్ధిస్తున్నారు. తాజాగా ఏఐసీసీ అధ్యక్ష రేసులో ఉన్న జ్యోతిరాదిత్య సింధియా సైతం కాంగ్రెస్ పార్టీతో విభేదించారు. ఎన్డీయే ప్రభుత్వ నిర్ణయానికి మద్దతిచ్చారు. జమ్ముకశ్మీర్ విభజనకు తన సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ట్విట్టర్ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించారు.  
 
ఇకపోతే రాజ్యసభలో జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు ప్రభుత్వ చీఫ్ విప్ భువనేశ్వర్ కలిటా. జమ్ముకశ్మీర్ బిల్లుపై పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చీఫ్ విప్ పదవికి రాజీనామా చేశారు.  
 
అంతేకాదు తన ఎంపీ పదవికి సైతం రాజీనామా చేశారు. భువనేశ్వర్ కలిటా రాజీనామాను రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు వెంటనే ఆమోదించడం కూడా చకచకా జరిగిపోయింది. తాజాగా ఏఐసీసీ అధ్యక్ష రేసులో ఉన్న సింధియానే పార్టీ అధ్యక్షుడు రాహుల్‌తో విబేధించడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 
 
జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన నేత. ప్రస్తుతం గుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు.  
 
అంతేకాదు గత ఏడాది జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో జ్యోతిరాదిత్య సింధియానే సీఎం అవుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే సీనియారిటీ దృష్ట్యా ఆ పదవిని కమల్ నాథ్ తన్నుకుపోయారు.  
 
ఇకపోతే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. తాను అధ్యక్షపదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. ఆ తర్వాత ఏఐసీసీ అధ్యక్ష పదవిపై పలు పేర్లు వినిపించాయి. వారిలో జ్యోతిరాదిత్య సింధియా ఒకరు కావడం విశేషం. అలాంటి వ్యక్తి పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.  
 
ఎమ్మెల్యే జగ్గారెడ్డి మద్దతు
జమ్ముకశ్మీర్‌ కు ప్రత్యేకప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 ఏ రద్దు చేయడంపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమర్థించారు. జమ్ముకశ్మీర్ విషయంలో  ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా నిర్ణయాన్ని జగ్గారెడ్డి స్వాగతించారు. 
 
జమ్ముకశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే బీజేపీపై సెటైర్లు వేశారు. 1950లో నాటి పరిస్థితుల దృష్ట్యా నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 
 
ఆనాడు నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ గానీ హోంమంత్రి అమిత్ షా ఉన్న అలాంటి నిర్ణయంమే తీసుకుంటారని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో  మోదీ, అమిత్‌షా తీసుకున్న నిర్ణయం సరైనవేనని అభిప్రాయపడ్డారు.  
 
పార్లమెంటులో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాలు జమ్ముకశ్మీర్ పునర్ విభజన బిల్లుపై చర్చ సందర్భంగా నెహ్రూపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆనాడు 540 సంస్థానాలు ఉండేవని వాటిలో హైదరాబాద్‌ సంస్థానం నిజాం పాలనలో కశ్మీర్ జునగర్ అధీనంలో ఉండేదని గుర్తు చేశారు. 
 
భారతదేశంలో విలీనం కావడానికి హైదరాబాద్‌ నిజాం నవాబు ఒప్పుకోలేదని కానీ ప్రజలు భారత్ లో కలవడానికి సిద్ధం అయ్యారని తెలిపారు. కశ్మీర్‌ రాజు భారత్‌లో విలీనం కావడానికి ఒప్పుకున్నాడని గానీ ప్రజలు మాత్రం ఒప్పుకోలేదని గుర్తు చేశారు. 
 
నిజాం ఒప్పుకోకపోవడంతో పటేల్‌ రంగంలో దిగారని ఆయన్ని ఒప్పించి సంస్థానాన్ని భారత్‌లో కలుపుకున్నారని తెలిపారు. కశ్మీర్ ప్రజలు పాకిస్తాన్‌లో కలవడానికి ఇష్టపడ్డారని ఆ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్‌ నుంచి కశ్మీర్‌ను కాపాడటం కోసం నెహ్రూ ఆర్టికల్  370, 35ఎ తీసుకొచ్చినట్లు చెప్పుకొచ్చారు. 
 
ఒకవేళ ఆ వెసులుబాటు కల్పించకపోతే ప్రజలకు ఇబ్బందులు కలిగేవని తెలిపారు. అప్పుడేం జరిగిందో ఇప్పుడున్న వాళ్లకు తెలియదన్నారు. ఒకవేళ పాకిస్థాన్ కశ్మీర్‌ను ఆక్రమించుకుంటే ఇప్పుడు చాలా ఇబ్బంది పడే వాళ్లమన్నారు. 
 
అప్పుడున్న పరిస్థితుల్లో మోదీ, షా కూడా అలాంటి నిర్ణయాలే తీసుకునేవాళ్లని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఎప్పుడూ సెక్యులర్ పార్టీయేనంటూ స్పష్టం చేసిన జగ్గారెడ్డి ఓటు బ్యాంకు రాజకీయాలు ఎప్పుడూ చేయలేదన్నారు. సీట్ల కోసం విధానాలకు భిన్నంగా కాంగ్రెస్ ప్రవర్తించదని స్పష్టం చేశారు.  
 
బీజేపీ ఒక మతానికి చెందిన పార్టీ అని ఆరోపించారు. ఆర్టికల్ 370, 35ఎ రద్దు చేయాలని ఆర్ఎస్ఎస్ ముందు నుంచి నిర్ణయించుకున్నాయని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దాన్ని ఇప్పుడు అమలు చేశారని చెప్పుకొచ్చారు. ఆనాటి పరిస్థితుల దృష్ట్యా కశ్మీర్ ను కాపాడేందుకు నెహ్రూ కీలక పాత్ర పోషిస్తే నేడు కశ్మీర్ ను కాపాడేందుకు ప్రధాని మోదీ, అమిత్ షాలు ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మద్యం నిషేధం అమలుపై జగన్ ప్రభుత్వం తొలి అడుగు