జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో భారత ఆర్మీ బలగాలు హింసకు పాల్పడుతున్నాయని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన షీలా రషీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై ఆమె ఓ ట్వీట్ చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో నిత్యవసరాలు అందక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని ఆమె ట్వీట్ చేశారు. స్థానిక పోలీసులకు ఎలాంటి అధికారాలు లేవని, మిలిటరీ బలగాలు హింసకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఇళ్లల్లోకి ఆర్మీ జవానులు చొరబడి యువకుల్ని అకారణంగా తీసుకెళ్తున్నారని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.
'జమ్మూ కాశ్మీర్‌లో మీడియా నిలిపివేయబడింది. గ్యాస్ స్టేషన్లు అన్నీ మూసివేశారు. మందుల కోసం ప్రజలు దూర ప్రాంతాలకు ప్రయాణించాల్సి వస్తోంది. సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఎలాంటి సమాచారం స్థానికులకు చేరడం లేదు. డీటీహెచ్ రీచార్జి చేసుకునే వెసులుబాటు లేదు. అతికొద్ది మందికి మాత్రమే టీవీ ప్రసారాలు అందుబాటులో ఉంది' అని పేర్కొన్నారు.
'జమ్మూ కాశ్మీర్ పోలీసులకు శాంతిభద్రతలపై ఎలాంటి అధికారాలు లేవు. అంతా పారామిలిటరీ దళాల చేతిలో ఉంది. సిఆర్‌పిఎఫ్ వ్యక్తి ఫిర్యాదు మేరకు ఒక స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌ను బదిలీ చేశారు. ఎస్‌హెచ్‌ఓలు వారి లాఠీలు మోస్తున్నారు. సర్వీస్ రివాల్వర్లను వారు కన్నెత్తి చూడడం లేదు. పారామిలిటరీ బలగాలు రాత్రి సమయాల్లో ఇళ్లల్లోకి ప్రవేశించి యువకుల్ని తీసుకెళ్తున్నారు. ఇళ్లల్లో దోపిడీకి పాల్పడుతున్నారు.
ఇంట్లో ఉన్న రేషన్ సరుకుల్ని చెల్లాచెదురు చేస్తున్నారు. షోపియన్‌లో నలుగురు యువకుల్ని ఆర్మీ క్యాంప్‌లోకి పిలిచి విచారించారు(హింసించారు). ఒక మైక్ వారి దగ్గర పెట్టి వారి అరుపుల్ని ఆ ప్రాంతంలోని వారికి వినిపిస్తూ భయభ్రాంతులకు గురి చేశారు. ఇలాంటి భయానక వాతావరణం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది' అని వ్యాఖ్యానించారు.