Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారో లేదో కానీ.. ఇదొక కొత్త టెన్షన్!

తమిళనాడు ప్రస్తుతం నిత్య ఉద్రిక్తతల మధ్య కాలం గడుపుతున్నట్లుంది. గత నాలుగురోజులుగా సాగుతోన్న రాజకీయ ప్రతిష్ఠంభనకు గవర్నర్‌ తెరదించినట్లు శుక్రవారం రాత్రి వార్తలు ప్రసారం కావడంతో తమిళనాట టెన్షన్‌ తారాస్థాయికి చేరింది.

Advertiesment
Tamil Nadu
హైదరాబాద్ , శనివారం, 11 ఫిబ్రవరి 2017 (02:22 IST)
తమిళనాడు ప్రస్తుతం నిత్య ఉద్రిక్తతల మధ్య కాలం గడుపుతున్నట్లుంది. గత నాలుగురోజులుగా సాగుతోన్న రాజకీయ ప్రతిష్ఠంభనకు గవర్నర్‌ తెరదించినట్లు శుక్రవారం రాత్రి వార్తలు ప్రసారం కావడంతో తమిళనాట టెన్షన్‌ తారాస్థాయికి చేరింది. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే అవకాశం కల్పించాలన్న శశికళ అభ్యర్థనను తమిళనాడు ఇన్‌చార్జి గవర్నర్‌ సి.విద్యాసాగర్‌రావు తిరస్కరించినట్లు, ఈ మేరకు శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదికలో గవర్నర్‌ స్పష్టమైన అభిప్రాయం వెల్లడించినట్లు తెలిసింది. దీంతో చిన్నమ్మ వర్గం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఈ వార్త బయటకు పొక్కగానే పన్నీర్ సెల్వం గ్రూప్ సంబరాలు చేసుకుంది కానీ అంతలోనే ఇటు గవర్నర్ కార్యాలయం, అటు కేంద్ర హోం శాఖ కూడా అలాంటి నివేదిక ఏదీ పంపలేదని, రాలేదని వెంటవెంటనే  ప్రకటించడంతో  పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. 
 
ముఖ్యమంత్రి పదవికోసం పోటీ పడుతోన్న ఇద్దరు నేతల(శశికళ, ఓ.పన్నీర్‌ సెల్వం)తో గురువారం భేటీ అయిన గవర్నర్‌, శుక్రవారం మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోనూ సమావేశం నిర్వహించారు. అటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతోనూ, ప్రతిపక్ష నేత స్టాలిన్‌తోనూ మాట్లాడారు. అందరి అభిప్రాయాలను క్రోడీకరించిన గవర్నర్‌.. శుక్రవారమే కేంద్ర హోం శాఖకు ఒక నివేదిక పంపినట్లు సమాచారం. ఆ నివేదికలోనే.. ప్రభుత్వ ఏర్పాటుకు శశికళను ఆహ్వానించబోనని గవర్నర్‌ పేర్కొన్నట్లు తెలిసింది.
 
శశికళ అభ్యర్థనను గవర్నర్ తోసిపుచ్చుతూ నివేదిక రూపొందించి కేంద్రానికి పంపారంటూ ఒక జాతీయ చానెల్‌ ప్రసారం చేసిన వార్తలు దావానలంలా మారి, దుమారం రేపుతుండటంతో కేంద్ర హోంశాఖ, తమిళనాడు రాజ్‌భవన్‌లు రంగంలోకి దిగాయి. 'అసలు అలాంటి నివేదిక ఏదీ గవర్నర్‌గారు కేంద్రప్రభుత్వానికి పంపనేలేదు' అని రాజ్‌భవన్‌ పౌరసంబంధాల అధికారి(పీఆర్‌వో) శుక్రవారం రాత్రి మీడియాకు చెప్పారు. అటు కేంద్ర హోం శాఖ కూడా 'తమిళనాడు గవర్నర్‌ నుంచి నివేదిక రాలేదు'అని తేల్చిచెప్పింది. దీంతో తమిళనాట ఉత్కంఠ కొనసాగుతూనేఉంది..
 
రాష్ట్రంలో నెలకొన్న ప్రతిష్ఠంభనను ఎక్కువకాలం గవర్నర్ కొనసాగించలేరు కాబట్టి ఆయన నుంచి ఏ సమయంలో ఎలాంటి ప్రకటన వస్తుందనేది మీడియాను నిద్రపోనీకుండా చేస్తోంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారో లేదో కానీ.. ఇదొక కొత్త టెన్షన్...