Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎమ్మెల్యేలను మళ్లీ తరలించిన శశికళ: బయటకు లాగుతానంటున్న సెల్వం

అన్నాడీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలు ఎక్కడున్నారనే అంశం తమిళనాడు హైకోర్టు వరకూ వెళ్లింది. శశికళ దాచిపెట్టేసిందని చాటుతున్న ఏఐడీఎంకే ఎమ్మెల్యేల గురించి తమకు నివేదిక ఇవ్వాలని హైకోర్టు శుక్రవారం ఆదేశించింద

ఎమ్మెల్యేలను మళ్లీ తరలించిన శశికళ: బయటకు లాగుతానంటున్న సెల్వం
హైదరాబాద్ , శనివారం, 11 ఫిబ్రవరి 2017 (04:52 IST)
అన్నాడీఎంకేకు చెందిన  ఎమ్మెల్యేలు ఎక్కడున్నారనే అంశం తమిళనాడు హైకోర్టు వరకూ వెళ్లింది. శశికళ దాచిపెట్టేసిందని చాటుతున్న ఏఐడీఎంకే ఎమ్మెల్యేల గురించి  తమకు నివేదిక ఇవ్వాలని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. దీంతో శశికళ వర్గం ఎమ్మెల్యేల శిబిరాన్ని మార్చేసింది. తమను ఎవరూ నిర్బంధించలేదని కొందరు అనుకూల ఎమ్మెల్యేలతో మాట్లాడించింది. ప్రస్తుత సంక్షోభానికి ఒకటి, రెండు రోజుల్లో ముగింపు పడి తామే అధికారం చేపడతామని శశికళ ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. 
 
శాంతి భద్రతల పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, డీజీపీ రాజేంద్రన్‌తో సమీక్షించిన గవర్నర్‌ విద్యాసాగర్‌రావు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సీఎం కుర్చీ ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ మరింత తీవ్రమైంది. అయితే మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తనను ఆహ్వానించాలంటూ శశికళ చేసిన విజ్ఞప్తిని గవర్నర్‌ తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరంలేదని మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రస్తుత సంక్లిష్ట రాజకీయ పరిస్థితుల్లో కేంద్రం సలహా మేరకే గవర్నర్‌ వ్యవహరించే అవకాశమే ఎక్కువగా ఉంటుందని ఆయన అభిప్రాయపడటం భవిష్యత్‌ పరిణామాలకు సూచకంగా కనిపిస్తోంది.
 
రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు, సినీ తారలు తనకు అండగా నిలిచినా... ఇతర రాజకీయ పార్టీలు తననే బలపరుస్తున్నా ఎమ్మెల్యేలు శశికళ శిబిరంలో ఉన్నతంకాలం తానేం చేయలేనని పన్నీర్‌కు తెలుసు. అందుకే శశికళ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలను బయటకు తేవడానికి ముప్పేట దాడి మొదలుపెట్టారు. ఎమ్మెల్యేలను శశికళ నిర్బంధించారంటూ హైకోర్టులో తన మద్దతుదారులతో పిటిషన్‌ వేయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కనిపించడం లేదని ఆయా నియోజక వర్గాలకు చెందిన ప్రజల ద్వారా పోలీసులకు ఫిర్యాదు ఇప్పించారు. 
 
పన్నీర్‌ దూకుడును గమనించిన శశికళ వర్గం ఎమ్మెల్యేలెవ్వరూ చేజారకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసుకున్నారు. పిటిషన్‌పై స్పందించిన చెన్నై హైకోర్టు ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు అనే అంశంపై సోమవారంలోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి, డీజీపీ, చెన్నై పోలీసుకమిషనర్, కాంచీపురం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. దీన్ని అవకాశంగా తీసుకుని పోలీసు బలంతో ఎమ్మెల్యేలను బయటకు రప్పించేందుకు పన్నీర్‌ అధికార అస్త్రం ప్రయోగించారు.
 
అయితే ఈ విషయం తెలియడంతో చిన్నమ్మ మద్దతుదారులు వాయువేగంతో తమ ఎమ్మెల్యేలను మరో శిబిరానికి తరలించారు. ఈస్ట్‌ కోస్టు రోడ్డులోని గోల్డన్‌ బే రిసార్ట్స్‌లో ఉన్న ఎమ్మెల్యేల వద్దకు వెళ్లబోయిన మీడియాను చిన్నమ్మ నియమించిన బౌన్సర్లు అడ్డుకున్నారు. శశికళకు అత్యంత నమ్మకస్తులైన 11 మంది శాసనసభ్యులను మాత్రం రిసార్ట్స్‌ నుంచి రెండు కిలోమీటర్ల దూరానికి తీసుకుని వచ్చి తాము ఎలాంటి నిర్బంధంలో లేమనీ, స్వేచ్ఛగా ఉన్నామని మాట్లాడించి తీసుకుని వెళ్లారు. 
 
తన ప్రయత్నం సఫలం కాకపోవడంతో పోలీసు బలగాలను ప్రయోగించి ఒకటి రెండు రోజుల్లో వారిని బయటకు తీసుకు రావడానికి పన్నీర్‌ వ్యూహాలు రచిస్తున్నారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎమ్మెల్యేలను చేజారనివ్వకుండా శశికళ కూడా చాలా గట్టి ఏర్పాట్లు చేశారు. పన్నీర్‌ వెనుక డీఎంకే ఉందని శశికళ మద్దతుదారులు పెద్ద ఎత్తున రాజకీయ దాడికి దిగారు. రహస్య శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలతో శశికళ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రమాణ స్వీకారమూ పోయె.. బందోబస్తూ పోయె.. శశికి మిగిలినవి శాపనార్థాలే..!