చిన్నమ్మ కథ ముగసింది : చెన్నై జైలుకు బదిలీకి ప్రయత్నాలు
శిక్షపడింది అక్రమాస్తుల కేసులోనే. కానీ ఆమె రాజసంగానే కాన్వాయ్ తోడుగా జైలుకెళ్లింది. ముందుగా అనుకున్నట్లు విమానంలో కాదు చెన్నయ్ నుంచి పూమల్లి, పెరంబదూరు, కాంచీపురం, రాణీపేట, వెల్లూరు, వాణం బాడి, అంబూరు, క్రిష్ణగిరి, హోసూరు మీదుగా బెంగళూరులోని పరప్పన అ
శిక్షపడింది అక్రమాస్తుల కేసులోనే. కానీ ఆమె రాజసంగానే కాన్వాయ్ తోడుగా జైలుకెళ్లింది. ముందుగా అనుకున్నట్లు విమానంలో కాదు చెన్నయ్ నుంచి పూమల్లి, పెరంబదూరు, కాంచీపురం, రాణీపేట, వెల్లూరు, వాణం బాడి, అంబూరు, క్రిష్ణగిరి, హోసూరు మీదుగా బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు చేరుకున్నారు. సరిగ్గా సాయంత్రం 5.15 గంటలకు జైలు వద్దకు శశికళ, ఇళవరసిలు ఒకే వాహనంలో వచ్చి కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి అశ్వత్థ నారా యణ వారితో ‘మీకు సుప్రీంకోర్టు శిక్ష విధించి న విషయం తెలిసిందా’అని అడిగారు. ఇందు కు వారు ‘తెలుసు, అందుకే ఇక్కడ లొంగిపోవ డానికి వచ్చామ’ని బదులిచ్చారు.
వివరాల నమోదు, సాధారణ వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి అనుమతితో శశికల, ఇళవరసి లు పది నిమిషాల పాటు బంధువు లతో మాట్లాడారు. అనంతరం వారిద్దరినీ జైల్లోని మహిళల బ్యారక్‌లోనికి తీసుకెళ్లారు. జైల్లోకి వెళ్లడానికి రెండు వారాల గడువు, ఇంటి నుంచి భోజనం కల్పించాలని శశికళ తన న్యాయవాదుల ద్వారా చేసిన విజ్ఞప్తిని న్యాయ మూర్తి తిరస్కరించారు. ఏ–క్లాస్ ఖైదీగా పరిగణించే విషయంలో జైలు ప్రధానాధికారిని సంప్రదించి, పొందవచ్చని సూచించారు.
శశికళ గంభీరంగా, చిరునవ్వుతో జైలులోకి వెళ్తూ కనిపించారు. జైలు అధికారులు శశికళకు 9234 నంబర్, ఇళవరసికి 9235, సుధాకరన్‌కు 9236 నంబర్‌ను కేటాయించారు. శశికళ, ఇళవరసిలకు ఒకే గది కేటాయించారు. శశికలకు మూడు నీలిరంగు చీరలు, ఒక ప్లేటు, ఒక చెంబు, ఒక గ్లాసు, ఒక కంబళి, దిండు, దుప్పటిని అందజేశారు. ప్రతి శుక్రవారం మాంసాహారం, పండుగ సందర్భాల్లో ప్రత్యేక భోజనాన్ని అందజేస్తారు. జైలులోని ఇతర ఖైదీలతో కలిసి టీవీ చూడవచ్చు. సాధారణ ఖైదీలతో పాటు వారు జైలులో చేయాల్సిన పనిని (అగరబత్తీలు, క్యాండిల్స్ తయారీ, నేతపని తదితరాలు)ఆదివారం కేటాయించనున్నారు. ఇందుకు రోజుకు రూ.50 వేతనం లభిస్తుంది.
తాజా ట్విస్టు ఏమిటంటే.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు తమిళనాడులో దాఖలైంది కాబట్టి తమను బెంగళూరు పరప్పణ అగ్రహారం జైలు నుంచి చెన్నైలోని పుళల్ జైలు లేదా మరేదైనా జైలుకు మార్చేందుకు శశికళ ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. తమిళనాడుకు తరలింపును కోరుతూ బెంగళూరు కోర్టులో త్వరలో పిటిషన్ దాఖలు చేస్తారని తెలుస్తోంది. కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు ముందుగా తమ అంగీకారాన్ని తెలిపితేనే బెంగళూరు కోర్టు శశికళ పిటిషన్‌ను పరిశీలిస్తుందని నిపుణులు అంటున్నారు. బెంగళూరు కోర్టులో లొంగిపోయినందున కనీసం రెండు నెలలు అగ్రహార జైల్లో గడపాల్సి ఉంటుంది.
జైల్లో తనకు వీఐపీ వసతులు కల్పించాలని కోరుతూ బెంగళూరు జైలు అధికారులకు శశికళ ఒక ఉత్తరం ద్వారా విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. మినరల్ వాటర్, ప్రత్యేకంగా ఎయిర్ కండీషన్డ్ గది, ఇంట్లో తయారైన భోజనం, వాకింగ్ సౌకర్యం కల్పించాలని ఆ ఉత్తరంలో కోరినట్లు సమాచారం. ఆదాయపు పన్ను క్రమం తప్పకుండా చెల్లించేవారికి మా త్రమే ఫ్యాన్, వార్తాపత్రికల సరఫరా తదితర సౌకర్యాలు కల్పించేందుకు వీలవుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఇక్కడా శశికళకు భంగపాటు తప్పదనిపిస్తోంది.
ఏదైమైనా.. వీడియోగ్రాఫర్‌గా జీవితం మొదలెట్టి అదృష్టం తంతే నేరుగా పోయెస్ గార్డెన్‌లోకి వచ్చి పడిన శశికళ అనే ఒక అనామకురాలు ముప్పై ఏళ్ల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి పోటీ పడే స్థాయి బలం సంపాదించుకుని పాత తీర్పు ప్రభావంతో నెత్తురు కక్కుకుంటూ నేలకు రాలిపోయిన చందాన ఇప్పుడు మళ్లీ అనామకురాలిగానే జైలు జీవితం గడపటానికి సిద్ధం కావడం విధి బలీయమేనా..