Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శశికళ జయ వారసురాలా? ససేమిరా అంటున్న గౌతమి

అన్నాడిఎంకే అధినేత్రి దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్థానంలో ఆమె వారసురాలిగా శశికళను గుర్తించే, అంగీకరించే ప్రశ్నే లేదంటున్నారు ప్రముఖ నటి గౌతమి. జయ మరణం వెనుక గోప్యతపై తల్లడిల్లుతూ ప్రధాని మోదీకే ఉత్తరం రాసిన గౌతమి ఇప్పుడు అన్నాడిఎంకే తరపున ముఖ్యమంత్రిగ

శశికళ జయ వారసురాలా? ససేమిరా అంటున్న గౌతమి
హైదరాబాద్ , శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (04:10 IST)
అన్నాడిఎంకే అధినేత్రి దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్థానంలో ఆమె వారసురాలిగా శశికళను గుర్తించే, అంగీకరించే ప్రశ్నే లేదంటున్నారు ప్రముఖ నటి గౌతమి. జయ మరణం వెనుక గోప్యతపై తల్లడిల్లుతూ ప్రధాని మోదీకే ఉత్తరం రాసిన గౌతమి ఇప్పుడు అన్నాడిఎంకే తరపున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి అర్రులు చాస్తున్న శశికళకు ఉన్న అర్హత ఏమిటి అని ఆమె ప్రశ్నిస్తున్నారు.  అమ్మ జయలలిత అన్ని సార్లు చేయెత్తి చూపి మరీ పన్నీర్ సెల్వమే నా తదనంతర ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత ఆమె వారసురాలు వీరు, వారు, మరొకరు అని ఎలా అనుకుంటాం? ఇన్నేళ్లుగా పన్నీర్ సెల్వం అమ్మతో ఉన్నారు. ఒక్కసారికూడా ఆయన్ని అమ్మ దూరం చేయడం, పార్టీనుంచి బయటకు గెంటడం, తన దరిదాపుల్లోకి రాకూడదని చెప్పడం.. ఒక్కసారైనా జరిగిందా..  ఆయన స్థిరత్వం, విశ్వాసం, ముక్కుసూటితనమే కదా అమ్మ ఆయన్ని నమ్మడానికి కారణం అంటున్న గౌతమి జయ మరణం నుంచి తాజా పరిణామాల వరకు పలు అంశాలపై తమ అభిప్రాయాలను స్పష్టంగా ప్రకటించారు. 
 
జయలలిత మరణం గురించి చాలా విషయాలు ఈ రోజుకీ తెలియడం లేదు. ఒకరు స్పృహ లేకుండా, వారు నిర్ణయం తీసుకునే పరిస్థితిలో లేకుండా ఉన్నప్పడు, ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఎవరో ఒకరు నిర్ణయాలు తీసుకోవాలి. ఎవ్వరన్నది ఇప్పటిదాకా తెలీడం లేదు. ఎందుకు? అప్పుడప్పుడూ వచ్చిన వైద్య బులెటిన్‌లు తప్ప ఇతరత్రా ఎలాంటి వివరాలు చెప్పలేదు. వివరాలు తెలీవు. కమ్యూనికేషన్ లేదు. నథింగ్..

అమ్మ తాలూకూ ఒక వాయిస్ బైట్ కానీ, వీడియో కానీ లేదు. వీడియో తీయలేదన్నారు. ఒప్పుకుందా. మరి ఫొటో... ఆమె గొంతు.. అందరితోనూ మాట్లాడుతున్నారన్నారు. నర్సులతో, డాక్టర్లతో చక్కగా జోకులేస్తూ మాట్లాడుతున్నారన్నారు. ఆమె లేచి కూర్చుంటున్నారు. తిరుగుతున్నారు. ఐసీయులోంచి బయటకు తరలించారు. మామూలు  గదికి మార్చారు. ఆ సమయంలో అయినా ఆమెను ఎందుకు చూపించలేదు. చివరిరోజు హార్ట్ ఎటాక్ వచ్చిందన్న రోజు కూడా ఆమె బాగున్నారు. ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లిపోవచ్చు అని కూడా చెప్పారు. మరి సడన్‌గా ఎందుకలా జరిగింది. 
 
ఆమె ఒక సాధారణ పౌరురాలు కాదు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. రాష్ట్ర పరిపాలన ఆమె చేతుల్లో ఉంది. కోట్లమంది ప్రజల తాలూకు జీవితం ఆమె చేతుల్లో ఉంది. ఆమె ఎలా ఉన్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారు అని తెలుసుకోవలసిన అవసరం ప్రజలకు లేదా? మీ ఇంట్లో ఒక విషయం జరిగితే మీరెంత జాగ్రత్తగా ఉంటారు. మీరు పదిమందిని అడగరూ? రాష్ట్రం తాలూకూ పరిపాలన విషయంలో ఇలా జరుగుతున్నప్పుడు మీకు ఆందోళన వేయదూ? ఏం జరుగుతోందని భయం, ఆత్రుత కలగదూ? సగటు వ్యక్తిగా నేనడుగుతున్న ప్రశ్న ఇది.  
 
జయలలిత స్థానంలో ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం 75 రోజులపాటు తాను కూడా అమ్మను చూడలేకపోయానంటున్నారు. ఇంకా చాలా విషయాలున్నాయి. నేను పది శాతం మాత్రమే బయటపెట్టాను అన్నారు కదా! కాని వాటికి సమాధానాలు వచ్చాయా? ఎందుకు ఆయన్ని కూడా చూడనివ్వలేదు అనే విషయంలో సమాధానం వచ్చిందా? ఇప్పటిదాకా ఆ విషయం బయటపెట్టడానికి బాధ్యత తీసుకున్నారా? ఆ నిర్ణయం నేను తీసుకున్నాను. ఎవరూ రాకూడదు అనే నిర్ణయం నాది అని ఎవరన్నా బాధ్యత తీసుకున్నారా? ఎందుకు అని నేనడుగుతున్నా. 
 
ఆమె ప్రయివేట్ సిటిజన్ అయి ఉంటే, ఈ ప్రశ్నలు అడిగే హక్కు మనకెవరికీ లేదు. ఆమె రాజకీయ నేత అయినప్పటికీ, తమిళ ప్రజల హృదయాలతో ఆమెకు ప్రగాఢమైన అనుబంధం ఉంది. ప్రజలతో ఆమె అనుబంధం నిన్నా మొన్నటిది కాదు. పద్నాలుగేళ్ల ప్రాయంలో నటించడం మొదలు పెట్టినప్పటినుంచి కొన్ని తరాల ప్రజలతోపాటు ఆమె ఎదిగి వచ్చారు. ఒక హీరోయిన్‌గా, స్టార్‌గా, రాజకీయ నేతగా ఆమె పాట్లు, అనుభవించిన బాధలు ఒకటా రెండా.. తమిళనాడు రాష్ట్రంలో అందరూ ఆమెతో పాటు ఎదిగి వచ్చినవారే. అది ఏవిధమైన బంధమో మీరు ఆలోచించాలి. వీటన్నిటికంటే ఒక ముఖ్యమంత్రిగా ఎలాంటి బాధ్యతలు ఆమె మోశారో తెలీదా? 
 
వీటన్నింటికన్నా ముఖ్యమైన విషయం.. ఒక ప్రాణం.. ఒక లైఫ్.. ఈ విషయంలో ఎవరైనా అడగాల్సిందే కదా. రేపు ఇలాంటి పరిస్థితి ఎవరికయినా జరగవచ్చు. అంత పెద్ద స్థాయిలో ఉన్న అమ్మకు, అమ్మా అని అందరూ నోరారా పిలిచే రాష్ట్రంలో ఆవిడ పరిస్థితి గురించి అడిగే హక్కు ఎవరికీ లేదంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు దిక్కెవరు అనిపిస్తుంది. ఇన్నేళ్లుగా అమ్మ వెనకాతల ఉండి నడిపించింది మొత్తంగా నేనే అని శశికళ చెప్పారు కదా.. మరి జయలలిత అంతిమ క్షణాల్లో ఏం జరిగిందని తెలిపే బాధ్యతను ఆమె ఎందుకు తీసుకోలేదు? ఆవిడ కాకపోతే అక్కడ ఆ సమయంలో ఇంకెవరున్నారు? ఏనాటికైనా తేల్చవలసిన విషయం ఇది. 
 
తమిళనాడు చరిత్రలో  పదవిలో ఉన్న వారు వరుసగా రెండోసారి మళ్లీ అధికారంలోకి రావడం చాలా అరుదు. అమ్మ అలా రెండోసారి గెలిచారు. తక్కువ మెజారిటీతోనో, లేక అదృష్టవశాత్తూ సాధించిన గెలుపు కాదది. పెద్ద మార్జిన్‌తో గెలిచారామె. ప్రజలకు ఆమె పట్ల ఉన్న నమ్మకం అలాంటిది. రాష్ట్రంలోని ప్రజలందరి మేలు కోరే భరోసా ఆమె మీద పెట్టామన్న ఆలోచనతోటే ప్రజలు తిరుగులేని విధంగా తీర్పు చెప్పారు. అలాంటి అమ్మే ఇప్పుడు లేరు. తన తర్వాత ఆమె ఎవరిని చూపించారు. మీకోసం నేను చేయాలనుకున్నది నా మార్గంలో చేయగలిగేవారు వీరు అని చాలా సార్లు ఆమె పన్నీరు సెల్వంనే చూపించారు. ఆ పదవిలో ఆయన ఇప్పటికే రెండు సార్లు కూర్చున్నారు. ఇది అందరికీ తెలిసిన నిజం. ఆమె విజన్‌ని సాధ్యం చేయగల వ్యక్తి ఎవరో ఆమ్మే తేల్చి చెప్పిన తర్వాత దాన్ని కొనసాగించడమే కదా ధర్మం. ప్రజలకు అమ్మ అలా ప్రామిస్ చేశారు. ఎన్నిసార్లు మాట్లాడినా మళ్లీ మళ్లీ అదే పాయింట్‌కే రావాల్సి ఉంటుంది. ప్రజల పట్ల ఇలాంటి జవాబుదారీతనం తప్పకుండా ప్రదర్శించాలి. 
 
ఈరోజు మనం చూస్తున్న పరిణామాలు సరైన పద్ధతిలో జరిగాయి అని ఎవరైనా చెప్పగలుగుతారా? ఇవ్వాళ పొద్దున బయటికి వచ్చిన అంశాలను చూస్తే, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపిక కూడా తాత్కాలిక ప్రాతిపదికనే జరిగింది అని ఇవ్వాళ తెలుస్తోంది. ఇలాంటి రహస్యాలు ఇంకా ఎన్ని ఉన్నాయి? పార్టీవరకు మాత్రమే అయితే అది అంతర్గత విషయం. కానీ ప్రజలను పాలించవలసిన సందర్భం వచ్చేసరికి అది అంతర్గత విషయంగా ఉండదు. అది మన రోజువారీ జీవితాన్ని ప్రతి క్షణమూ ప్రభావితం చేసే నిర్ణయం. అలాంటి నిర్ణయం తీసుకునే హక్కు ప్రజలకు మాత్రమే ఉంది. వారు తమ నిర్ణయాన్ని చెప్పేశారు. ఆ నిర్ణయాన్ని మార్చే అధికారం ప్రజలకే తప్ప మరెవరికీ లేదు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శశికళపై కేసులో తీర్పు వచ్చేవారమే.. నిరీక్షణ తప్పనట్లే