రెచ్చిపోయిన శశికళ... పన్నీర్ సెల్వం ఔట్.. రాష్ట్రపతి పాలన తప్పదా?
ధిక్కారమున్ సైతునా అనే రేంజిలో అన్నాడిఎంకే ప్రధాన కార్యదర్శి శశికళా నటరాజన్ రెచ్చిపోయారు. తమిళనాడు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుని రెండు రోజులు కాకముందే నేరుగా తిరుగుబాటు ప్రకటించిన పన్నీర్ సెల్వంపై శశికళ దండనాస్త్రం ప్రయోగించారు. మౌనం వీడిన సెల్వం
ధిక్కారమున్ సైతునా అనే రేంజిలో అన్నాడిఎంకే ప్రధాన కార్యదర్శి శశికళా నటరాజన్ రెచ్చిపోయారు. తమిళనాడు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుని రెండు రోజులు కాకముందే నేరుగా తిరుగుబాటు ప్రకటించిన పన్నీర్ సెల్వంపై శశికళ దండనాస్త్రం ప్రయోగించారు. మౌనం వీడిన సెల్వం దివంగత సీఎం జయలలిత సమాధి వద్ద చేసిన ప్రకటన ఒక సంచలనం అయితే కొద్ది గంటల్లోపే అన్నాడీఎంకే కోశాధికారి పదవి నుంచి పన్నీర్‌ను తొలగిస్తూ మంగళవారం అర్ధరాత్రి ఆదేశాలు జారీచేసిన శశికళ మరో సంచలనానికి దారితీశారు.
ఆవేదనాభరిత ప్రకటనతో పెనుసంచలనం సృష్టించిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు చిన్నమ్మ గట్టి షాకిచ్చింది. మెరీనా బీచ్‌లో పన్నీర్ మీడియా సమావేశం అనంతరం పోయెస్ గార్డెన్‌లో ఎమ్మెల్యేలతో అత్యవసరంగా భేటీఅయిన శశికళ అన్నాడీఎంకే కోశాధికారి పదవి నుంచి పన్నీర్‌ను తొలగిస్తూ మంగళవారం అర్ధరాత్రి ఆదేశాలు జారీచేశారు. సెల్వం స్థానంలో శ్రీనివాసన్‌ను కోశాధికారిగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మాత్రం ఎక్కడా పేర్కొనలేదు.
ప్రజల మద్దతు ఉన్న వ్యక్తి మాత్రమే పార్టీని నడిపించాలన్నది అమ్మ(జయ) నిర్ణయమని, కానీ ప్రస్తుతం పార్టీలోని పరిస్థితులు అందుకు విరుద్ధంగా తయారయ్యాయని పన్నీర్ సెల్వం ఆరోపించడం అన్నాడీఎంకే చీలికకు దారితీసింది. మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి వద్ద గంటపాటు దీక్ష చేసిన అనంతరం పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడారు. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా తనను సీఎం పదవి నుంచి బలవంతంగా తొలిగించారని ఆయన ఆవేదన చెందారు.
ఓపీఎస్ మీడియా సమావేశం అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. 'ఓపీఎస్.. ఓపీఎస్..' అంటూ పెద్ద ఎత్తున నినాదాలుచేస్తూ, శశికళపై విమర్శలు చేశారు. అటు శశికళ కూడా వేగంగా స్పందిస్తూ కీలక నాయకులతో మంతనాలు సాగించారు. చివరికి పన్నీర్‌ను పార్టీ పదవి నుంచి తొలిగించారు. ఒకవేళ పన్నీర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లైతే అతని ఇమేజ్ మరింత పెరుగుతుందనే భావనతోనే చిన్నమ్మ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు అర్థం అవుతున్నది.
తనపై అక్రమాస్తుల కేసు, భూ కుంభకోణం కేసుపై త్వరలో సుప్రీకోర్టు తీర్పు రానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవిపై కన్నేసి పన్నీరు సెల్వంని బలవంతంగా సీఎం పోస్టు నుంచే తప్పించిన శశికళ ఆగడాలను గత కొద్ది రోజులుగా పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం తమిళనాడులో తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన విధించే సూచనలు కనిపిస్తున్నాయి. సెల్వం బలవంతపు రాజీనామా సమయం నుంచి ఇప్పటిదాకా అట్టుకుతున్న తమిళనాడు రాజకీయాలను నేడు చెన్నయ్ రాబోతున్న గవర్నర్ విద్యాసాగరరావు మలుపు తిప్పనున్న సంకేతాలు వినిపిస్తున్నాయి. శశికళను ఎట్టిపరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి పదవిలో చూడటం ప్రధాని మోదీకి రుచించకపోవడం కూడా తమిళనాడును రాష్ట్రపతి పాలనవైపు తీసుకుపోయే అవకాశాలకు సూచికగా భావిస్తున్నారు.