Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పన్నీర్‌కు - పళనికి దారేది? గవర్నర్ చేతిలో 'పంచ'తంత్రం

తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీకోసం తిరుగుబాటు నేత ఓ పన్నీర్ సెల్వం, శశికళ అనుచరుడు ఎడప్పాడి పళనిస్వామిలు ఉడుం పట్టుపట్టారు. ఇందుకోసం వారు రాజ్‌భవన్‌ చుట్టూత ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ, గవర్నర్ సీహెచ్

పన్నీర్‌కు - పళనికి దారేది? గవర్నర్ చేతిలో 'పంచ'తంత్రం
, గురువారం, 16 ఫిబ్రవరి 2017 (08:33 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీకోసం తిరుగుబాటు నేత ఓ పన్నీర్ సెల్వం, శశికళ అనుచరుడు ఎడప్పాడి పళనిస్వామిలు ఉడుం పట్టుపట్టారు. ఇందుకోసం వారు రాజ్‌భవన్‌ చుట్టూత ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ, గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు మాత్రం ఇంకా తన మనసులోని మాటను బహిర్గతం చేయలేదు. 
 
దీనికి పలు కారణాలు లేకపోలేదు. అధికార అన్నాడీఎంకేలో అంతర్గత సంక్షోభం ఏర్పడింది. ఇది రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికిదారితీసింది. ఇది ఇప్పట్లో సద్దుణిగేలా కనిపించడం లేదు. దీనికితోడు సీఎం కుర్చీకోసం ఇరు వర్గాలు గట్టిపట్టుబట్టాయి. ఈ కారణంగా గవర్నర్‌ ఎటూ నిర్ణయం తీసుకోలేక న్యాయనిపుణుల సలహాలు స్వీకరిస్తున్నారు. ఈ పరిస్థితిపై పలువురు న్యాయనిపుణులు పలు రకాల అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం గవర్నర్‌ ముందు ఐదు ఆప్షన్లు ఉన్నట్టు తెలుస్తోంది. వాటిని ఓ సారి పరిశీలిస్తే...! 
 
ఆప్షన్.. 1. ప్రస్తుతం అన్నాడీఎంకే ఎల్పీ నేతగా ఎన్నికైన మాజీ మంత్రి, సీనియర్ నేత, శశికళ ప్రధాన అనుచరుడు ఎడప్పాడి పళనిస్వామి గవర్నర్‌ను కలిసి తనకు తగినంత ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉందని, అందువల్ల ప్రభుత్వ ఏర్పాటుకు తక్షణం ఆహ్వానించాలని కోరారు. ఈ లేఖతో గవర్నర్‌ సంతృప్తి చెందితే ఎడప్పాడిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం. 
 
ఆప్షన్.. 2. ఎమ్మెల్యేలను కూవత్తూరు రిసార్టులో బంధించివున్నారన్నది ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న తిరుగుబాటు నేత ఒ.పన్నీర్‌ సెల్వం చేసే ప్రధాన ఆరోపణ. అదేసమయంలో తనకు తగినంత ఎమ్మెల్యేల బలం ఉన్నట్టు ఆయన గవర్నర్‌కు లేఖ రూపంలో ఇప్పటివరకు సమర్పించలేదు. ఈ పరిస్థితుల్లో తగినంత మంది ఎమ్మెల్యేలు ఉన్న ఎడప్పాడిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి ఆ మరుక్షణమే అసెంబ్లీలో బల నిరూపణకు ఆదేశించడం. 
 
ఆప్షన్.. 3. అసెంబ్లీలో ఎడప్పాడి మెజార్టీ నిరూపించలేని పక్షంలో పన్నీర్‌ సెల్వంను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి, సభలో బలం నిరూపించుకోవాల్సిందిగా ఆదేశించడం. ఇది జరగాలంటే తనకు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు గవర్నర్‌కు పన్నీర్ లేఖ సమర్పించాల్సి ఉంది. 
 
ఆప్షన్.. 4. ఎడప్పాడి, పన్నీర్‌సెల్వంలు తమ బలాన్ని నిరూపించుకోలేని పక్షంలో 89 మంది సభ్యులతో రెండో అతిపెద్ద పార్టీగా విపక్ష డీఎంకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం. కానీ డీఎంకే మాత్రం ప్రభుత్వ ఏర్పాటుకు ఏమాత్రం మొగ్గు చూపకుండా, మధ్యంతర ఎన్నికల కోసం ప్రయత్నిస్తోంది. 
 
5. అసెంబ్లీని సమావేశపరచి 'కాంపోజిట్‌' బలనిరూపణ చేసుకోవాలని ఆదేశించడం. అప్పుడు ఎడప్పాడి పళనిస్వామి, ఒ.పన్నీర్‌సెల్వంలలో ఎవరి బలమెంతో తేలిపోతుంది. అయితే ఎడప్పాడి, పన్నీర్‌ సెల్వం, డీఎంకే సభలో మెజార్టీ నిరూపించుకోలేని పక్షంలో రాష్ట్రంలో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ లేనందున 356 నిబంధన కింద రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయవచ్చు. ఇదే జరిగితే రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శశికళ పాలిట సింహస్వప్నం... కర్ణాటక మాజీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ బి.వి.ఆచార్య