దినకరన్‌కి 9 మంది ఎమ్మెల్యేల మద్దతు: శశికళ బలం ఇంతేనా.. అందుకే ఔట్
తమిళనాడుకు గత మూడు నెలలుగా పట్టిన శని ఇక వదిలినట్లేనా..పన్నీర్ సెల్వంకి సాధ్యం కాని పని ఈసీ పరోక్షంగా చక్కెబెట్టిందా.. శశికళకు మించిన ముఠాకోరు దినకరన్ వేసుకున్న సెల్ఫ్‌గోల్ చివరికి శశికళ భవిష్యత్తునే భూస్థాపితం చేసిపారేసిందా? అవునంటున్నారు పరిశీలకులు
తమిళనాడుకు గత మూడు నెలలుగా పట్టిన శని ఇక వదిలినట్లేనా..పన్నీర్ సెల్వంకి సాధ్యం కాని పని ఈసీ పరోక్షంగా చక్కెబెట్టిందా.. శశికళకు మించిన ముఠాకోరు దినకరన్ వేసుకున్న సెల్ఫ్‌గోల్ చివరికి శశికళ భవిష్యత్తునే భూస్థాపితం చేసిపారేసిందా? అవునంటున్నారు పరిశీలకులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా శశికళ జైలుకు వెళ్లిన దరిమిలా పార్టీ పగ్గాలను మేనల్లుడు దినకరన్‌కు కట్టబెట్టడం, ఇటీవలి ఆర్కే నగర్ ఉప ఎన్నికలో అన్నాడీఎంకే అభ్యర్థిగా బరిలోకిదిగిన దినకరన్ విచ్చలవిడి అవినీతికి పాల్పడటం తదితర పరిణామాలు పార్టీని తీవ్రంగా దెబ్బతీశాయి.
రెండాకుల గుర్తు కోసం దినకరన్ ఏకంగా ఎన్నికల సంఘానికే లంచం ఇవ్వజూపినట్లు రుజువుకావడం, ఆయనపై పలు కేసులు నమోదుకావడం అన్నాడీఎంకేకు కోలుకోలేని దెబ్బలా పరిణమించింది. ఈ నేపథ్యంలో పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత తమదేనని గుర్తించిన సీఎం పళని, మంత్రులు ఆ దిశగా పావులు కదిపారు. మొదట పన్నీర్ వర్గంతో సంధికుదుర్చుకుని, ఆపై శశికళ, దినకరన్‌లపై వేటువేశారు. పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కాగా అన్నాడిఎంకే పార్టీ నుంచి శశికళ కుటుంబాన్ని వెలేయడంపై ఆమె బంధువు దినకరన్ రగిలిపోతున్నారు. తనకు మద్దతిస్తున్న 9 మంది ఎమ్మెల్యేలతో దినకరన్ సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై యోచిస్తున్నారు. దినకరన్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు సిఎం పళనిస్వామి, మాజీ సిఎం పన్నీర్ సెల్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిన్నమ్మ కుటుంబాన్నే అవమానిస్తారా అని ప్రశ్నిస్తున్నారు.
122 మంది మద్దతుదారులతో పన్నీర్ సెల్వం గ్రూపును చావగొట్టి అధికారపీఠం చేజిక్కించుకున్న శశికళకు చివరికి మిగిలిందే 9 మంది ఎమ్మెల్యేలేనా.. దినకరన్ పెట్టిన పెంటతో అధికారమే లేకుండా పోతుందనే భయం అన్నాడిఎంకే అమ్మ వర్గం మంత్రులు, ఎమ్మెల్యేలకు నరనరానా పాకిపోయిన కారణంగానే ఆ వర్గం ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం బాట తప్ప మరో మార్గం లేదనే నిర్ణయానికి వచ్చేసినట్లు కనబడుతోంది. దీనిఫలితంగానే.. ఆరు నెలలపాటు తీవ్ర మలుపులు తిరిగిన తమిళ రాజకీయ క్రీడ.. చిన్నమ్మ శశికళపై వేటుతో ఎట్టకేలకు ఓ ముగింపునకు వచ్చింది.
శశిని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలిగించారు. ఆమె మేనల్లుడు, అన్నాడీఎంకే తాత్కాలిక ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌పై కూడా వేటు పడింది. ఈ మేరకు ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలోని పార్టీ ఉన్నతస్థాయి కమిటీ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో అన్నా డీఎంకే బహిష్కృత నేత, మాజీ సీఎం పన్నీర్ సెల్వంను, ఆయన వర్గాన్ని తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధమైంది.
తమిళనాడుకు మంచి రోజులు మొదలయ్యాయా.. వేచి చూడాల్సిందే మరి.