Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలీవుడ్ నటుడు సైఫ్‌కు వారసత్వ ఆస్తులు దక్కేనా?

Advertiesment
Saif ali khan

ఠాగూర్

, శుక్రవారం, 24 జనవరి 2025 (12:17 IST)
ఇటీవల దుండగుడు కత్తిపోట్ల నుంచి తప్పించుకున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌కు వారసత్వం సంక్రమించే ఆస్తులు రూ.15 వేల కోట్లవరకు ఉన్నాయి. పటౌటీ నవాబుల వంశానికి చెందిన సైఫ్ కుటుంబానికి భోపాల్ పూర్వ పాలకుల నుంచి ఈ ఆస్తులు వారసత్వంగావచ్చాయి. ఇపుడు ఈ ఆస్తుల యాజమాన్య హక్కులపై సందిగ్ధత నెలకొంది. 
 
ఆ ఆస్తులు ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ పరిధిలోకి రావంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను మధ్యప్రదేశ్ హైకోర్టు గత డిసెంబరు 13న రద్దు చేసింది. ఈ నేపథ్యంలో వాటిని కాందిశీకుల ఆస్తులుగా గుర్తిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ పరిధిలోని కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయం ఉత్తర్వు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ సైఫ్ కుటుంబం పిటిషన్ దాఖలు చేసిందా లేదా అన్న విషయంపై స్పష్టత లేదని న్యాయవాదులు తెలిపారు. ఒకవేళ వారు ఆ ఉత్తర్వును సవాలు చేయకపోతే ఆ ఆస్తులు కేంద్ర ప్రభుత్వానికి చెందుతాయని వెల్లడించారు.
 
భోపాల్‌లో సైఫ్ కుటుంబానికి అతడి నాన్నమ్మ సాజిదా సుల్తాన్ నుంచి పలు విలాసవంతమైన భవంతులు వారసత్వంగా వచ్చాయి. భోపాల్ చివరి నవాబు హమీదుల్లా ఖాన్ కుమార్తె సాజిదా. ఆయన పెద్ద కుమార్తె అబీదా సుల్తాన్ దేశ విభజన నేపథ్యంలో పాకిస్థాన్‌కు 1950లో వలస వెళ్లారు. సాజిదా ఇక్కడే నివసిస్తూ పటౌడీ నవాబు అయిన ఇప్తిఖర్ అలీఖాన్(సైఫ్ తాత)ను వివాహమాడారు. సాజిదాకు ఆమె తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులు కాలక్రమంలో ఆమె వారసులైన సైఫ్ కుటుంబానికి దక్కాయి. 
 
అయితే హమీదుల్లాకు చట్టబద్ధ వారసురాలు అబీదా మాత్రమే అని, ఆమె పాకిస్థాన్‌కు వలస వెళ్లినందువల్ల ఎనిమీ యాక్ట్ ప్రకారం ఆ ఆస్తులను కాందిశీకుల ఆస్తులుగా గుర్తిస్తున్నట్లు కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయం 2015లో ప్రకటించింది. దీన్ని సవాలు చేస్తూ సైఫ్ తల్లి, ప్రముఖ నటి షర్మిలా ఠాగోర్ మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. 2019లో సాజిదాను కూడా వారసురాలిగా గుర్తిస్తున్నట్లు ఉత్తర్వులు రావడంతో సైఫ్ కుటుంబానికి ఊరట దక్కింది. కానీ ఇప్పుడు అందుకు భిన్నమైన ఆదేశాలు రావడంతో వారి కుటుంబం న్యాయపోరాటం కొనసాగిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భిక్షం వేసి బుక్కయ్యారు... పోలీసుల కేసు నమోదు