ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం మొదలుకావడంతో ఆయన ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తో పాటు ఇతర విభాగాలకు చెందిన కీలక అధికారులు పాల్గొన్నారు. ఇందులో ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య జదరుగుతున్న యుద్ధ పరిణామాలు, భారతదేశంపై తక్షణ ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు.
కాగా, ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య మొదలైన యుద్ధంతో భారత్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుంది. రష్యా మిత్ర దేశం. ఉక్రెయిన్ చిన్నదేశం. పైగా, ఆ దేశం పరిస్థితి చూస్తే ఎవరికైనా జాలి కలిగేలా వుంది. ఇది భారత్‌ను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది. అయితే, ప్రస్తుతానికి భారత్ తటస్థ వైఖరిని అవలంభిస్తుంది.
మోడీ చెబితే పుతిన్ వింటారు.. ఉక్రెయిన్ రాయబారి
ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ విమానాలు విరుచుకుపడుతున్నాయి. ఈ దాడుల ధాటికి ఉక్రెయిన్ తల్లడిల్లిపోతోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ సైనిక శక్తిని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా రష్యా బాంబుల వర్షం కురిపిస్తుంది. దీనిపై భారత్‌లోని ఉక్రెయన్ రాయబారి ఇగోర్ పొలిఖా స్పందించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో భారత్ అండగా ఉండాలని కోరారు.
ప్రస్తుత నెలకొన్న సంక్షోభానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ చెబితే రష్యా అధినేత పుతిన్ సానుకూలంగా వినే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలోనే మోడీ అత్యంత శక్తిమంతమైన నేత అని, ఆయనను ప్రతి ఒక్కరూ గౌరవిస్తారని చెప్పారు.
అందువల్ల ప్రస్తుతం సంక్షోభానికి చరమగీతం పాడేందుకు ప్రధాని మోడీ కల్పించుకుని పుతిన్‌తో మాట్లాడాలని ఆయన కోరారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో పాటు రష్యా అధినేత పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడాలని కోరారు. పుతిన్ ఎవరి మాట వినకపోయినప్పటికీ ప్రధాని మోడీ మాట మాత్రం వింటారని ఆయన చెప్పారు.