Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్కేనగర్ బైపోల్ : ఓటర్లకు రూ.89 కోట్ల పంపిణీ... జయ వేలిముద్ర నిర్ధారణకు రూ.5 లక్షల లంచం

చెన్నై ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి ఈనెల 12వ తేదీన జరగాల్సిన పోలింగ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. దీనికి ప్రధాన కారణం ఓటర్లకు భారీ మొత్తంలో డబ్బు ఎర చూపడమే. ముఖ్యంగా అన్నాడీఎంకే అమ్మ పార్టీ

ఆర్కేనగర్ బైపోల్ : ఓటర్లకు రూ.89 కోట్ల పంపిణీ... జయ వేలిముద్ర నిర్ధారణకు రూ.5 లక్షల లంచం
, సోమవారం, 10 ఏప్రియల్ 2017 (13:00 IST)
చెన్నై ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి ఈనెల 12వ తేదీన జరగాల్సిన పోలింగ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. దీనికి ప్రధాన కారణం ఓటర్లకు భారీ మొత్తంలో డబ్బు ఎర చూపడమే. ముఖ్యంగా అన్నాడీఎంకే అమ్మ పార్టీ తరపున పోటీ చేస్తున్న శశికళ బంధువు టీటీవీ దినకరన్ డబ్బును మంచినీళ్ళలా పంచిపెట్టారు. ఒక్కో ఓటుకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు చెల్లించారు. ఇలా మొత్తం రూ.89 కోట్లను పంపిణీ చేసినట్టు సమాచారం. 
 
ఈ విషయం ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి విజయభాస్కర్‌తో పాటు.. ఆయన అనుచరులు ఇళ్ళలో ఆదాయపన్ను శాఖ అధికారులు జరిపిన సోదాల్లో బయటపడ్డాయి. ఇదే అంశంపై ఐటీతో పాటు ఆర్కే.నగర్ బైపోల్ ప్రత్యేక ఎన్నికల అధికారి బోత్రా ఇచ్చిన నివేదికను పరిశీలించిన ఈసీ... ఉప ఎన్నికను రద్దు చేసింది. 
 
మరోవైపు ఆర్కే.నగర్‌ ఓటర్లకు డబ్బు పంపిణీ చేసిన వారిలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి కూడా ఉండటం గమనార్హం. ఈయన పర్యవేక్షణలో 33193 మంది ఓటర్లకు రూ.13 కోట్ల 27 లక్షల 72 వేల రూపాయలను పంపిణీ చేశారు. అలాగే, వైద్య మంత్రి విజయభాస్కర్ నేతృత్వంలో రూ.2,77,08,000ను పంపిణీ చేసినట్టు వినికిడి. 
 
అలాగే, విద్యా మంత్రి కేఏ సెంగోట్టయ్యన్ పర్యవేక్షణలో 35830 మంది ఓటర్లకు రూ.13,13,20,000 మేరకు పంపిణీ చేశారు. వీరితో పాటు.. తంజావూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత వైద్యలింగం ఆధ్వర్యంలో 27837 మంది ఓటర్లకు రూ.11,13,47,000, అటవీశాఖామంత్రి దిండిగల్ శ్రీనివాసన్ పర్యవేక్షణలో 32092 మంది ఓటర్లకు రూ.12,83,68,000 మేరకు పంపిణీ చేసినట్టు సమాచారం. 
 
ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలన్న ఏకైక లక్ష్యంతో దినకరన్ 16 మంది సభ్యులతో కూడిన ఎన్నికల కమిటీని ఏర్పాటు చేయగా, ఇందులో సీఎం, మంత్రులతో పాటు, పలువురు పార్టీ నేతలు, స్థానిక కార్యకర్తలకు చోటు కల్పించారు. వీరంతా కలిసి రూ.89 కోట్ల మేరకు పంపిణీ చేసినట్టు ఐటీ అధికారుల సోదాల్లో బహిర్గతమైంది. దీనికి సంబంధించిన లెక్కల పత్రాలు వాట్సాప్‌లో హల్‌‌చల్ చేశాయి. 
 
మరోవైపు.. దివంగత జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమె వేలిముద్రతో కూడిన పార్టీ ప్రకటన ఒకటి జారీ అయింది. ఈ వేలి ముద్ర జయలలితదే అని నిరూపించేందుకు సైతం ఓ వైద్యుడికి రూ.5 లక్షల మేరకు లంచం ఇచ్చినట్టు ఓ దస్తావేజును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో అనేక కీలక దస్తావేజులను స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు... విచారణ నిమిత్తం మంత్రి విజయభాస్కర్‌తో పాటు.. పలువురిని పిలిచింది. వీరి తర్వాత సీఎం ఎడప్పాడిని సైతం విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లికి భారీ సంఖ్యలో బంధువులు.. అన్నం ఎక్కువగా వండలేదని గొడవ.. పెళ్లే వద్దన్న వధువు..