భారత 76వ గణతంత్ర వేడుకలు హస్తినలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించి సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ వేడుకలకు ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెల్సిందే. త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం ఈసారి ప్రత్యేకత. వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కేంద్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు.
స్వర్ణిమ్ భారత్, విరాసత్ ఔర్ వికాస్ అనే ఇతివృత్తంతో ఈసారి కవాతులో పాల్గొనే శకటాలకు రూపకల్పన చేశారు. బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణులు, పినాక మల్టీబ్యారెల్ రాకెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కర్తవ్య పథ్‌పై హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట వరకు 9 కిలోమీటర్ల మేర రిపబ్లిక్ డే పరేడ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రాలు, యూటీలు, కేంద్ర శాఖలకు చెందిన 31 శకటాలను ప్రదర్శిస్తున్నారు.
మరోవైపు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రాజ్యాంగాన్ని రూపొందించి ప్రజాస్వామ్యం, గౌరవంతో పాటు ఐక్యతగా దేశ అభివృద్ధి ప్రయాణం సాగేలా కృషి చేసిన మహనీయులందరికీ ఈ సందర్భంగా నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ వేడుక మన రాజ్యాంగ విలువలను కాపాడుతుందన్నారు. బలమైన సంపన్నమైన దేశాన్ని నిర్మించే దిశగా మన ప్రయత్నాలను బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ మోదీ ట్వీట్ చేశారు. దేశ ప్రజలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రిపబ్లిక్ డే అనేది భారత రాజ్యాంగ విలువలపై విశ్వాసం, సామాజిక సమానత్వం, ప్రజాస్వామ్యంపై అంకితభావానికి చిహ్నమన్నారు.
బలమైన గణతంత్రానికి పునాది వేసిన స్వాతంత్ర్య సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతలకు ఈ సందర్భంగా నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ 76వ గణతంత్ర దినోత్సవం నాడు అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను నిర్మించడంలో ప్రధాని మోదీకి సహకరిస్తామని ప్రతిజ్ఞ చేద్దామన్నారు.