భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఇకలేరు. ఆయన సారథ్యంలోని టాటా గ్రూపు ఉన్నత శిఖరాలను చేరుకుుంది. ఉప్పు నుంచి ఉక్కు వరకు టాటాలు ప్రవేశించని రంగమే లేదు. ఏ వ్యాపారమైనా నాణ్యతే, నమ్మకమే పెట్టుబడిగా ముందుకు సాగారు. ఫలితంగా ఆ గ్రూపు అంచెలంచెలుగా ఎదిగింది. ఈ టాటా గ్రూప్ ప్రస్థానంలో రతన్ టాటా కృషి అపారమైనది.. అసామన్యమైనది.
నిత్య మార్గదర్శకుడిగా, దాతృత్వశీలిగా, మానవతావాదిగా పేరు గడించిన రతన్ టాటా.. ప్రపంచంలోనే దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరిగా ఎదిగారు. ఆయన నేతృత్వంలో టాటా గ్రూప్.. తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది. రతన్ టాటా ఎప్పుడూ లాభాల కంటే చిత్తశుద్ధికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అదే ఆయనకు అపారమైన గౌరవాన్ని సంపాదించిపెట్టింది.
తీసుకొనే నిర్ణయాలు స్వల్పకాలిక లాభాల కంటే సంస్థకు, సమాజానికి దీర్ఘకాలిక శ్రేయస్సుకు ఉపయోగపడేలా ఉండాలని భావిస్తారు. అందుకే వ్యాపారవేత్తల్లో ఆయన ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తారు. వ్యాపారాలను నిర్వహించడంలోనే కాదు.. దాతృత్వంలోనూ ఎప్పుడూ ముందుంటారు. ఆయన జీవనశైలి, వ్యాపారాలను నడిపించే తీరు ఎంతో మందికి ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలుస్తుంది. రతన్ టాటా అనగానే గుర్తొచ్చే కొన్ని అంశాలు ఇవీ..!
దేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అధినేత రతన్‌టాటా. కానీ, ఆయన ఎంతో వినయంగా ఉంటారు. ప్రచారాలకు, ఆర్భాటాలకు దూరంగా.. సాధారణ జీవనశైలితో ఉండటానికి ఇష్టపడతారు. రతన్ టాటా నాయకత్వంలో.. టాటా గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది, జాగ్వార్, ల్యాండ్ రోవర్, కోరస్ స్టీల్ వంటి పెద్ద పెద్ద కంపెనీలను కొనుగోలు చేసింది. ఆయన టాటా కంపెనీని బహుళజాతి కంపెనీగా మార్చారు. సంస్థ విలువను నిలుపుకుంటూనే టాటా గ్రూప్‌ను ప్రపంచ బ్రాండ్‌గా మార్చారు.
రతన్ టాటా ఎప్పుడూ వినూత్నంగా ఆలోచించేవారు. సామాన్యప్రజలకు కారు అందుబాటులో ఉండేలా తక్కువ ధరకు నానో కారును ఆవిష్కరించారు. ఆయన తీసుకున్న ఎన్నో సాహసోపేత నిర్ణయాలు సంస్థను ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడ్డాయి. ముంబైలోని తాజ్ హోటల్‌లో 2008లో ఉగ్రదాడి జరిగింది. ఆ సమయంలో రతన్ టాటా చూపించిన ఉదారత ఎంతో గొప్పది. హోటల్ సిబ్బందితోపాటు బాధితులుగా మారిన వారందరికీ అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. దానికి కట్టుబడి ఉన్నారు.
వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించే క్రమంలో ఆయన ఎప్పుడూ భారతీయ విలువలు, సంస్కృతిని విస్మరించలేదు. భారతీయుడిగా గర్వపడుతూ.. ఆధునిక వ్యాపారంలోనూ ప్రపంచంతో పోటీ పడ్డారు. ఉద్యోగుల పట్ల ఆయన ఎంతో శ్రద్ధ చూపేవారు. సంక్షోభ సమయాల్లో ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడేవారు. టాటా స్టీల్‌లో కంపెనీలో పనిచేసే ఉద్యోగులు మరణించినప్పుడు వారి కుటుంబ బాధ్యత తీసుకున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో ఇదో అరుదైన విధానంగా చెబుతుంటారు.