ఆర్టికల్ 370, 35ఎ రద్దు: జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లు ఆమోదం

సోమవారం, 5 ఆగస్టు 2019 (19:49 IST)
సోమవారం నాడు రాజ్యసభలో జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లును ఆమోదించారు. దీనితో జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడమే కాకుండా జమ్ము-కాశ్మీర్, లడఖ్ రెండూ కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారనున్నాయి. ఫలితంగా దేశంలో 29 రాష్ట్రాల సంఖ్య 28కి కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య 7 నుంచి 9కి పెరిగాయి.
 
జమ్ముకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు అనుకూలంగా 125 మంది సభ్యులు ఓటు వేయగా 61 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ఒకరు తటస్థంగా వున్నారు. మెజారిటీ సభ్యుల నిర్ణయం మేరకు రాజ్యసభలో జమ్ముకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు పాస్ అయినట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించి సభను మంగళవారానికి వాయిదా వేశారు. 
 
అంతకుముందు ఆర్టికల్ 370 రద్దుపై చర్చ జరిగింది. దీనిపై హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ... జమ్ముకశ్మీర్‌లో మారణకాండకు ఆర్టికల్ 370 కారణమంటూ చెప్పారు. దీనితో కశ్మీర్ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదనీ, దీనిని రద్దు చేయడం ద్వారా కశ్మీర్ ప్రజల అభివృద్ధికి బాటలు వేస్తున్నట్లు పేర్కొన్నారాయన. కాగా ఆర్టికల్ 370, 35ఎ రద్దుకి వైసీపీ, తెరాస, బీఎస్పీ, టీడీపీ, ఏఐఏడీఎంకే, బిజు జనతా దళ్, ఆమ్‌ ఆద్మీ పార్టీలు మద్దతు తెలిపాయి. వ్యతిరేకించిన పార్టీలు కాంగ్రెస్‌, పీడీపీ, డీఎంకే, ఎండీఎంకే.  

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఆర్టికల్ 370, 35-ఏ రద్దుతో అంతా మంచే జరుగుతుంది: అమిత్ షా