జయ చికిత్స ఖర్చు ఎవరు భరిస్తారో తెలీదు.. ఆమెను బాధపెట్టాను.. అయినా పెద్దకూతురి పెళ్ళికొచ్చారు.. రజనీ
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు 75 రోజుల చికిత్స కోసం ఖర్చులను అందించాలని అపోలో యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరలేదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. జయ అనారోగ్యంతో
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు 75 రోజుల చికిత్స కోసం ఖర్చులను అందించాలని అపోలో యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరలేదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. జయ అనారోగ్యంతో సెప్టెంబర్ 22న చెన్నై గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆమె చికిత్స పొందుతూ ఈ నెల 5న మృతిచెందినట్లు అపోలో యాజమాన్యం ప్రకటించింది.
ఆస్పత్రిలో 75 రోజుల పాటు జయకు అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో కూడిన చికిత్స అందించారు. అందుకు రూ.90 కోట్లు ఖర్చయినట్లు వార్తలొచ్చాయి. దీనిపై ఓ అధికారి మాట్లాడుతూ... జయ చికిత్సకు భారీగా ఖర్చయ్యే అవకాశమున్నా.. అంత పెద్ద మొత్తమయ్యే అవకాశం ఏమాత్రం లేదని చెప్పుకొచ్చారు. జయ వైద్య ఖర్చులు ఎవరు భరిస్తారనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు.
ఇదిలా ఉంటే, జయలలితను తాను బాధపెట్టానని, 1996 అసెంబ్లీ ఎన్నికల్లో తన వ్యాఖ్యలవల్లే జయలలితకు చెందిన అన్నాడీఎంకే పార్టీ ఓటమిపాలైందని సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. 1996లో జయలలితకు వ్యతిరేకంగా నిలిచానన్న విషయం తనను ఇప్పటికీ బాధపెడుతోందని రజనీ వెల్లడించారు. జయలలిత మళ్లీ ఆధికారంలోకి వస్తే తమిళనాడును దేవుడుకూడా రక్షించలేడని ఈ ఎన్నికల సందర్భంగా రజనీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు తమిళ చలనచిత్ర నటీనటుల సంఘం సంతాప సభ ఏర్పాటు చేసింది. జయలలితతో పాటు ప్రముఖ పాత్రికేయులు చో రామస్వామికి కూడా ఒకే వేదికపై సంతాపసభ ఏర్పాటు చేశారు. చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మంటపంలో జరిగిన ఈ కార్యక్రమంలో నటులు రజనీకాంత్, విశాల్, కార్తీ, గౌతమి, నదియా, వాణిశ్రీ, భారతి, అంబిక, రాధ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. జయలలితతో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. 1996లో ఆమె ఎన్నికల్లో ఓడిపోవడానికి తానూ ఓ కారణమన్నారు. విమర్శించి ఆమెను బాధపెట్టానని.. అయినా పెద్ద మనసు చేసుకుని తన కుమార్తె పెళ్లికి వచ్చారని వెల్లడించారు.