కోడలిని కాపాడేందుకు మామ, వారిద్దరినీ కాపాడేందుకు భర్త చెరువులో దూకి ప్రాణాలు విడిచారు. రాజస్థాన్‌లోని బీకనెర్ జిల్లాలోని లూణాకరణ్‌సర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. సీఓ దుర్గాపాల్ అందించిన సమాచారం ప్రకారం కిస్తురియా గ్రామంలో భన్వర్‌లాల్ అనే వ్యక్తి కుటుంబంతోపాటు నివసిస్తున్నాడు. సాయంత్రం 6 గంటల సమయంలో కోడలు లక్ష్మి (23) మంచినీళ్లు తేవడానికి చెరువు వద్దకు వెళ్లింది. నీళ్లు తోడుతుండగా ప్రమాదవశాత్తూ కాలుజారి చెరువులో పడిపోయింది.
భయంతో ఆమె కేకలు వేయగా మామ భన్వర్‌లాల్(50) అక్కడకు పరుగున వచ్చి, కోడలి పరిస్థితిని చూచి కాపాడేందుకు తాను కూడా చెరువులోకి దూకాడు. వారిద్దరూ మునిగిపోవడం చూసి లక్ష్మి భర్త లేఖ్‌రామ్ (24) కూడా వారిని కాపాడేందుకు చెరువులో దూకాడు. చెరువు చాలా లోతుగా ఉండటంతో బయటకు రాలేకపోయారు. పరిస్థితిని గమనించిన భన్వర్‌లాల్ భార్య వారిని రక్షించేందుకు తాడును విసిరింది. వారు దానిని పట్టుకోవడంలో విఫలమై చెరువు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. చెరువు 15 అడుగుల లోతు ఉన్నందున మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు నీటిని మోటార్‌లతో బయటకు తోడుతున్నారు.