తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి ప్రారంభమైన వర్షాలపై తమిళనాట ఆసక్తికర చర్చ సాగుతోంది. నిజానికి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారమైన వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలపై అన్నాడీఎంకే, డీఎంకే శ్రేణులతో పాటు.. ఆయా పార్టీల అభిమానులు కూడా ఈ ఆసక్తికర చర్చ జరుపుతున్నారు.
బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండగా, అధికార అన్నాడీఎంకే, డీఎంకే వర్గాల్లో కొత్త రకపు చర్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తర్వాత వెల్లడైన సర్వేలు - ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల కారణంగా ఇప్పటికే అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు తీవ్రంగా మథనపడుతున్నాయి.
నిజానికి పోలింగ్ ముగిసిన వెంటనే వెలువడిన ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల్లో అధికశాతం అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా, డీఎంకేకు అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. అన్నాడీఎంకే అధికారానికి దూరమవుతుందని 4 ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించగా, కాదు కాదు మళ్లీ ఆ పార్టీనే అధికారంలో ఉంటుందని సీ ఓటర్ సంస్థ పేర్కొంది. దీంతో అన్నాడీఎంకే వర్గాల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలు కనిపిస్తున్నాయి. అదేసమయంలో డీఎంకేలో సంతోషం వెల్లివిరిస్తోంది.
ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పురట్చితలైవి 'అమ్మ' అధికారానికి దూరమవుతోందన్న బాధతో ఆకాశం కన్నీరు కారుస్తోందని అన్నాడీఎంకే వర్గాలు చెబుతుండగా, కలైంజ్ఞర్ కరుణానిధి మళ్లీ సీఎం కాబోతున్నారని ఆకాశం ఆనందభాష్పాలు రాలుస్తోందంటూ డీఎంకే వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి.
ఇంకోవైపు... రాష్ట్ర ఓటరు 'వంతులవారీ అధికారం' విషయంలో పాత సంప్రదాయమే తప్ప, కొత్త ఒరవడిని సృష్టించలేకపోయాడని, దీంతో ఆకాశం అల్లాడిపోతోందని, ఆ బాధే వర్షపు రూపంలో భూమిని తాకుతోందంటూ ప్రజాసంక్షేమ కూటమి, డీఎండీకే, పీఎంకే, బీజేపీ వర్గాలకు చెందిన శ్రేణులు సెటైర్లు వేస్తున్నారు.