కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టయ్యారు. ఆయనతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో సహా అనేక మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి వెళుతుండగా వీరిని అరెస్టు చేశారు. ఆ తర్వాత ప్రత్యేక బస్సులో వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ అరెస్టుల నేపథ్యంలో ఢిల్లీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
లోక్‌సభ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, ఇండియా కూటమి నేతలు ఆరోపిస్తున్న విషయం తెల్సిందే. వీటిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెంచేందుకు సోమవారం విపక్ష నేతలంతా కలిసి ఢిల్లీలో ర్యాలీ చేపట్టారు. పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయానికి పాదయాత్రగా వెళ్లేందుకు సిద్ధంగా కాగా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయితే, నేతలు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ముందుకు సాగడంతో పోలీసలు అడ్డుకున్నారు.
సంసద్ మార్గ్‌ను బ్లాక్ చేశారు. భేటీకి 30 మందికి అనుమతిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించగా, అందరం కలిసి వెళతామని ఇండియా కూటమి నేతలు పట్టుబట్టారు. పోలీసులు అడ్డు చెప్పినా బారికేడ్లు ఎక్కి అవతలకు దూకి రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఇండియా కూటమి ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.