పుల్వామా ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్.. తీవ్రవాదం వైపు అడుగులు వేయడానికి గల కారణాలను ఆయన తల్లిదండ్రులు వెల్లడించారు. గతంలో తమ బిడ్డ పట్ల భారత ఆర్మీ నడుకున్న తీరుతోనే ఉగ్రవాదిగా మారిపోయాడని వావోయారు. అతను ఉగ్రవాదంవైపు మళ్లడానికి గల కారణాలను వారు వివరించారు. ఆదిల్ చదువుకునే రోజుల్లో జరిగిన ఓ అవమానకర సంఘటన వల్లేనని చెప్పారు.
'నా కొడుకు ఏనాడూ భద్రతా బలగాలపై రాళ్లు రువ్వలేదు. ఇంటి పనుల్లో తన తల్లికి తోడుగా ఉండేవాడు. కానీ, 2016లో ఒక రోజు పాఠశాలకు వెళ్లి వస్తుంటే.. భద్రతాసిబ్బంది ఆపి ముక్కును నేలకు రాయించారు. చితకబాది జీపు చుట్టూ తిప్పించారు. ఆదిల్ ఆ అవమానాన్ని భరించలేకపోయాడు. కారణం లేకుండా ఎందుకు కొట్టారని అడిగేవాడు. వారిపై కోపం పెంచుకొని ఉగ్రవాద సంస్థలో చేరాలని నిర్ణయించుకున్నాడు. ఎంత నచ్చజెప్పినా వినలేదు' అని ఆదిల్ తండ్రి వెల్లడించాడు.
గత ఏడాది ఇంట్లో నుంచి పారిపోయాడని, సమీర్ అహ్మద్ అనే బంధువుల అబ్బాయితో కలిసి జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలో చేరినట్లు సమాచారం వచ్చిందని చెప్పాడు. ఉగ్రవాదాన్ని వీడాలని ఎంత బతిమిలాడినా మాట వినలేదని ఆదిల్ తల్లి ఫహ్మీదా చెప్పింది. 2016లో రాళ్లు రువ్విన ఘటనలో ఓ యువకుడ్ని కాపాడేందుకు వెళ్లగా జవాన్లు పేల్చిన బులెట్ ఆదిల్ కాలిలోకి చొచ్చుకెళ్లిందని, అప్పటి నుంచి కొన్ని నెలల పాటు ఇంట్లోనే ఉన్నాడని వారు వివరించారు.