Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కమాండో ఆపరేషన్‌కు భారత్ సిద్ధం.. అమెరికా సహకారం

కమాండో ఆపరేషన్‌కు భారత్ సిద్ధం.. అమెరికా సహకారం
, మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (11:29 IST)
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సమాయత్తమవుతోంది. ఇందులోభాగంగా, ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసేందుకు భారత సైన్యం సిద్ధమవుతోంది. ముఖ్యంగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌ భూభాగంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేయాలని భావిస్తోంది. ఈ తరహా దాడులకు అగ్రరాజ్యం అమెరికా కూడా పూర్తిస్థాయిలో సహకరించనుంది. 
 
ముఖ్యంగా, 49 మంది జవాన్ల ప్రాణాలు తీసిన పుల్వామా ఉగ్రదాడికి ఏదో ఒకటి చేయాలన్న కృతనిశ్చయంతో భారత్ ఉంది. ఇందుకోసం కమాండో మెరుపు దాడులు చేసేలా వ్యూహ రచనలు చేస్తోంది. ఇప్పటిదాకా భారత స్పందన కేవలం దౌత్యపరమైన ఒత్తిడి, ప్రపంచదేశాల్లో పాక్‌ను ఏకాకిని చెయ్యడం, ఆర్థిక దిగ్బంధనం.. మొదలైన వాటికే పరమితమవుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితిని దాటి నిర్దిష్ట, కఠిన చర్యలకు తగిన మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిసింది. పాకిస్థాన్‌లో ఎంపిక చేసిన లక్ష్యాలపై లక్షిత దాడులు జరపాలన్నది భారత్‌ తాజా వ్యూహంగా కనిపిస్తోంది. ఇదే విషయాన్ని నిఘా వర్గాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. 
 
ప్రధానంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) జాబితాలో ఉన్న మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టులు పాక్‌లో తలదాచుకున్న శిబిరాలపై దాడులు జరపాలన్న ఆలోచన సాగుతోంది. జైషే ఛీఫ్‌ మసూద్‌ అజర్‌, లష్కరే తయీబా అధినేత హఫీజ్‌ మొహమ్మద్‌ సయూద్‌, జకీ ఉర్‌ రహ్మాన్‌ లఖ్వీ మొదలైన ఉగ్రవాదులు, మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం స్థావరాలతో పాటు తక్కువ శక్తి గల అణు పేలుడు పదార్థాలను దాచిన స్థావరాలపై కూడా దాడులు చేసేందుకు కసరత్తు సాగుతున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి. ఈ స్థావరాలను గుర్తించేందుకు భారత్‌కు అమెరికన్‌ గూఢచార సంస్థ సిఐఏ సహకరిస్తున్నట్లు సమాచారం. 
 
వాస్తవానికి గత 2016 సర్జికల్‌ దాడుల తర్వాత ఆక్రమిత కాశ్మీర్లోని అనేక చోట్ల నుంచి ఉగ్రవాద తండాలు వేరే చోటికి తరలిపోయాయి. అవి ఎక్కడెక్కడ ఉంటున్నదీ 'రా' కూ, ఇతర భారత గూఢచారి వర్గాలకూ చాలా వరకూ ఎరుకే. అయినప్పటికీ సీఐఏతో సమాచారం మార్పిడి చేసుకొని నిర్దిష్టంగా టార్గెట్లను ఖరారు చేసుకొనే ప్రయత్నం జరుగుతోందన్నది తాజా సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వికటించిన వివాహ పాయసం... 500 మందికి అస్వస్థత