కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలోని బిలియనీర్లకు మాత్రమే మోడీ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు, దళితులు, మహిళలకు ఎలాంటి భద్రత లేదని ఆరోపించారు.
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘రైతులకు న్యాయం’ పేరిట ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న ప్రియాంకా గాంధీ మాట్లాడారు. ఈ దేశం కొంత మందిది మాత్రమే కాదని, మీ అందరిదని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘ఈ దేశం ప్రధాని, ఆయన మంత్రులది మాత్రమే కాదు. ఈ దేశం మీది. అప్రమత్తంగా లేకపోతే మీ దేశంతోపాటు మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు’ అని పేర్కొన్నారు.
లఖింపుర్ ఖేరీలోని రైతుల మృతిపై స్పందించని ప్రధాని నరేంద్ర మోడీ సహా ఇతర నేతలపై ప్రియాంక మండిపడ్డారు. లక్నోలో పర్యటించవచ్చు కానీ లఖింపుర్ ఖేరీలో పర్యటించి రైతు కుటుంబాలను పరామర్శించలేరా? అంటూ ఈ నెల 5న లక్నోలో ప్రధాని మోడీని ప్రశ్నించారు.
రైతుల హత్యలో అరెస్టయిన ఆశిష్ మిశ్రా తండ్రి, హోం మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని ఈసందర్భంగా డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు కావాల్సింది డబ్బు కాదని, వారికి న్యాయం కావాలని కోరారు. ముద్దాయిలకే కాదు వారి కుటుంబాలకు కూడా ప్రధాని మోడీ సర్కారు ఆశ్రయం, రక్షణ కల్పిస్తుంది ఆంటూ మండిపడ్డారు.