ప్రశాంత్ కిషోర్ దేశంలోనే అతిపెద్ద ఎన్నికల వ్యూహకర్తలలో ఒకరు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి, 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసిపి, 2021 తమిళనాడు ఎన్నికల్లో డిఎంకె వంటి వివిధ పార్టీల విజయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం 2026లో తన తొలి ఎన్నికల ప్రచారంలో నటుడు, దళపతి విజయ్‌కు మార్గనిర్దేశం చేయబోతున్నారు.
తమిళ అగ్ర నటుడు విజయ్ గత సంవత్సరం తమిళగ వెట్రి కళగం (టీవీకే)ను ప్రారంభించిన విషయం తెలిసిందే. తన ప్రస్తుత సినిమా పనులను పూర్తి చేసిన తర్వాత, ఈ ఏడాది చివర్లో ఆయన క్రియాశీల రాజకీయాల్లో పాల్గొంటారు. ఇంతలో, టీవీకే పార్టీ సభ్యులు ఇప్పటికే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.
తన తొలి ఎన్నికల్లో గట్టిగా పోటీ చేయడానికి విజయ్, టీవీకే ప్రత్యేక సలహాదారుగా వ్యవహరించే ప్రశాంత్ కిషోర్‌తో చేతులు కలిపారని తెలుస్తోంది. 2026 ఎన్నికల్లో పార్టీ విజయానికి తన మార్గదర్శకత్వం, మద్దతు వుంటుందని ప్రశాంత్ కిషోర్ హామీ ఇచ్చారు. ఇప్పటికే, టీవీకే విజయ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ మార్గదర్శకత్వం పార్టీని మరింత బలోపేతం చేయవచ్చు.
ప్రశాంత్ కిషోర్ 2023లో తన సొంత పార్టీ అయిన జన్ సురాజ్ పార్టీని ప్రారంభించారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేయనుంది.