Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ లైఫ్ జర్నీ ఎలా సాగిందంటే?

Advertiesment
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ లైఫ్ జర్నీ ఎలా సాగిందంటే?
, సోమవారం, 31 ఆగస్టు 2020 (19:10 IST)
pranab
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బహుముఖ ప్రజ్ఞాశాలి. భారత మాజీ రాష్ట్రపతిగా, పలుమార్లు కేంద్ర మంత్రిగా పనిచేసి, ఏ పదవి చేపట్టినా ఆ పదవికి వన్నె తెచ్చిన నేతగా దేశ ప్రజలందరి అభిమానం చూరగొన్నారు. కొద్దికాలం మినహా దాదాపు తన జీవితకాలమంతా కాంగ్రెస్ నేతగానే ఆయన గడిపారు. అయినా పార్టీలకు అతీతంగా అందరి మన్ననలు పొందారు.
 
ఐదు దశాబ్దాలకు పైబడిన రాజకీయ జీవితంలో ఏడుసార్లు పార్లమెంటేరియన్‌గా ప్రణబ్ పని చేశారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టక ముందు టీచర్‌గా, జర్నలిస్టుగా పనిచేశారు. 1969లో ఆయన తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. బెంగాల్‌లోని జాంగిపూర్ నుంచి 2004లో ఆయన తొలిసారి లోక్‌సభకు ఎన్నికైనా, దీనికి ముందు వరుసగా నాలుగు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆయన గెలుపొందారు.
 
రాజకీయ వ్యూహకర్తగా, పార్లమెంటేరియన్‌గా ప్రణబ్ ముఖర్జీ తిరుగులేని నేతగా కొనసాగారు. 1972లో ఇందిరాగాంధీ కేబినెట్‌లో పనిచేశారు. అప్పట్నించి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఆయన చేపట్టిన అత్యంత శక్తివంతమైన శాఖల్లో ఆర్థిక శాఖ, వాణిజ్య, విదేశాంగ, రక్షణ శాఖ వంటివి ఉన్నాయి. మన్మోహన్ సింగ్ సారథ్యంలోని ప్రభుత్వంలో ప్రణబ్‌ పనిచేయడంతో పాటు, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా పరిష్కరించే ట్రబుల్ షూటర్‌గా పేరుతెచ్చుకున్నారు.
 
ఇందిరాగాంధీ హత్యానంతరం రాజీవ్ గాంధీ హయాంలో ప్రణబ్‌కు అంతగా ప్రాధాన్యం లభించలేదు. ఇందిరాగాంధీతో సరిపోలిన ప్రతిభాశాలి, అనుభవశాలి కావడంతో ఆయనను రాజీవ్ గాంధీ పక్కనపెట్టి, పార్టీపై పట్టు సాధించాడని చెబుతారు. ప్రణబ్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించకుండా పశ్చిమబెంగాల్ పీసీసీకి పంపడం జరిగింది. దీంతో 1986లో రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్‌ పార్టీని ప్రణబ్ పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభించారు. మూడేళ్ల తర్వాత ఆ పార్టీ తిరిగి కాంగ్రెస్‌లో కలిసిపోయింది.
 
ప్రణబ్ ముఖర్జీ 1935, డిసెంబరు 11న పశ్చిమ బెంగాల్‌లోని మిరితిలో జన్మించారు. 2012, జులై 25 నుంచి 2017, జులై 25 వరకు భారత రాష్ట్రపతిగా సేవలందించారు. 1969లో ఇందిరా గాంధీ హయంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. 
 
1973లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రక్షణ మంత్రిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగా, ఆర్థిక మంత్రిగానూ సేవలందించారు. 2012లో యూఏపీ మద్దతుతో రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచి పీ.ఏ. సంగ్మాను ఓడించారు. 70 శాతం ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాష్ట్రపతి పదవీకాలం పూర్తయ్యాక రాజకీయాలకు దూరంగా ఉన్నారు ప్రణబ్ ముఖర్జీ.
 
కాంగ్రెస్ పార్టీలో మూడు తరాల నేతలతోనూ ప్రణబ్‌కు సత్సంబంధాలున్నాయి. దాదా మృతితో కాంగ్రెస్‌ పార్టీతో పాటు యావత్ దేశం శోక సంద్రంలో ముగినిపోయింది. ఆయన మృతి పట్ల ప్రధాని మోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు కేంద్రమంత్రులు, సీఎంలు, ఎంపీలు, ఎమ్మెల్యేలంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వయంకృషితో అత్యున్నతస్థాయికి ఎదిగిన ప్రణబ్ : ఉపరాష్ట్రపతి