చంద్రుడి దక్షిణ ధృవం ఉపరితలంపై పరిశోధనలు చేస్తున్న ప్రజ్ఞాన్ రోవర్ తృటిలో ముప్పు తప్పించుకుంది. తాను ప్రయాణిస్తున్న మార్గంలో ఉన్న పెద్ద గోతిలో పడే ప్రమాదం నుంచి తప్పింది. ఇస్రో శాస్త్రవేత్తల సూచనలతో ప్రజ్ఞాన్ రోవర్ తన దారి మార్చుకుంది. ఈ గోతితో పాటు ప్రజ్ఞాన్ రోవర్ దారి మళ్లిన దానికి సంబంధించిన ఫోటోలను ఇస్రో రిలీజ్ చేసింది. చంద్రమండలంలో 4 మీటర్ల లోతైన గొయ్యిని గుర్తించిన రోవర్‌ను అప్రమత్తం చేసిన ఇస్రో.. గొయ్యికి మూడు మీటర్ల ఇవతలి నుంచే రూటు మార్చుకుని సురక్షిత మార్గంలో ముందుకుసాగింది.
ఈ ప్రజ్ఞాన్ రోవర్‌కు అమర్చిన సెన్సార్ కెమెరాలు ఈ గొయ్యిని గుర్తించాయి ఇస్రోను అలెర్ట్ చేశాయి. దీంతో గొయ్యి మరో 3 మీటర్ల దూరంలో ఉందనగా ఇస్రో గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ నుంచి రోవర్‌కు సంకేతాలు పంపింది. ఆ వెంటనే రోవర్ తన దారి మార్చుకుని సురక్షిత మార్గంలో ప్రయాణించింది. ఈ ఘటన సోమవారం జరిగింది. ఈ మేరకు రోవర్ గమనానికి సంబంధించిన రెండు ఫోటోలను ఇస్రో మీడియాకు రిలీజ్ చేసింది. అందులో ఒకటి గొయ్యి ఉన్న ప్రాంతం కాగా, మరొకటి రోవర్ వెళుతున్న కొత్త దారిని చూడొచ్చు.