తమిళనాడులో కలకలం రేపిన పొల్లాచ్చి లైంగిక దాడికి సంబంధించిన కేసులో నలుగురు కిరాతకులపై గుండా చట్టం కింద కేసు నమోదు చేశారు. మహిళలకు భద్రతనిచ్చే రాష్ట్రాల్లో ఒకటైన తమిళనాడులో.. పొల్లాచ్చి ఘటన చోటుచేసుకోవడం పెను సంచలనానికి దారి తీసింది.
పొల్లాచ్చిలో కళాశాల విద్యార్థినులతో ఫేస్ బుక్ ద్వారా ఫ్రెండ్స్‌గా పరిచయమై.. ప్రేమిస్తున్నానని లొంగదీసుకుని.. లైంగిక వేధింపులకు గురిచేసే ముఠాను పోలీసులు గుర్తించారు. కళాశాల విద్యార్థినులపై లైంగిక దాడులకు పాల్పడి.. ఆ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసే కిరాతకులపై గుండా చట్టం కింద కేసు నమోదు చేశారు కోవై పోలీసులు.
ఈ ఘటనకు సంబంధించి శబరిరాజన్ (25), తిరునావుక్కరసు (25), సతీష్ (28), వసంతకుమాక్ (27)లను పోలీసులు అరెస్ట్ చేశారు. కోవైలో ఈ ముఠాచే లైంగిక వేధింపులకు గురైన విద్యార్థిని పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి.. ఈ ముఠా చేతిలో లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థినుల వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. అలాగే ఈ కేసులో తమిళనాడులోని అధికారిక అన్నాడీఎంకేకి చెందిన కార్యకర్త నిందితుడిగా వున్నాడని తెలిసింది. ఇతడిని అన్నాడీఎంకే పార్టీ పార్టీ నుంచి తొలగించినట్లు కూడా వెల్లడించింది.
కోయంబత్తూరు పోలీసులకు ఈ కామాంధులపై ఫిర్యాదు చేసిన కళాశాల విద్యార్థిని.. ఫిబ్రవరి 12వ తేదీన ఎఫ్‌బీలో పరిచయమైన శబరిరాజన్ అనే యువకుడిని కలిసేందుకు వెళ్లింది. కారులో వెళ్దామని చెప్పి ఆమెను ఎక్కించుకున్న శబరిరాజన్ అదే కారులో తన స్నేహితులతో కలిసి కళాశాల విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ తతంగాన్ని వీడియో కూడా తీశాడు. ఆపై బ్లాక్ మెయిల్ చేశాడు. ఆమె నుంచి బంగారాన్ని దోచుకున్నాడు. ఈ ముఠా, కాలేజీ అమ్మాయిలతో పాటు పాఠశాల విద్యార్థినులపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడిందని పోలీసులు చెప్తున్నారు.