నొప్పి పుడుతుందని ఆపరేషన్ ఆపేస్తామా.. ఇదీ అంతే.... నాడు స్ట్రాంగ్ చాయ్ అడిగారు.. : నరేంద్ర మోడీ
నొప్పి పుడుతుందని మధ్యలోనే చేసే ఆపరేషన్ నిలిపివేస్తామా? పెద్ద నోట్ల రద్దు విషయం కూడా అంతేనని తన సన్నిహితుల వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నట్టు సమాచారం. ప్రజల కష్టాలను ఆసరా చేసుకుని అవకాశం తీసుకోవా
నొప్పి పుడుతుందని మధ్యలోనే చేసే ఆపరేషన్ నిలిపివేస్తామా? పెద్ద నోట్ల రద్దు విషయం కూడా అంతేనని తన సన్నిహితుల వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నట్టు సమాచారం. ప్రజల కష్టాలను ఆసరా చేసుకుని అవకాశం తీసుకోవాలనుకుంటే అయ్యేపనికాదని, పూర్తి స్థాయిలో మెజారిటీ ఇచ్చి కేంద్రంలో గద్దెపై కూర్చోబెట్టింది, సమర్థవంతంగా నడిపించడానికేనని, తాను అదే పని చేస్తున్నానని తేల్చి చెప్పారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజీయాపూర్‌లో జరిగిన బీజేపీ పరివర్తన్ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ తాను టీ అమ్మినప్పుడు స్ట్రాంగ్ ఛాయ్ కావాలని జనం అడిగేవారని, ఇప్పుడు కూడా తన నుంచి స్ట్రాంగ్ నిర్ణయాలే తీసుకుంటున్నారని మోడీ ఛాయ్ చమత్కారం విసిరారు. అయినా రెండు, మూడు వారాల ఇక్కట్లే.. ఇంత ప్రేలాపన పలుకుతున్న ప్రతిపక్షం ఏడాదిన్నర ఎమెర్జన్సీ విధించినప్పుడు ఈ సున్నితత్వం ఎక్కడికి పోయిందని ఆయన నిలదీశారు.
'దేశం కోసం, వ్యవస్థ కోసం తప్పనిసరి ఆపరేషన్ చేస్తున్నప్పుడు నొప్పి సహజమేనని, నొప్పిగా ఉందికదా అని ఆపరేషన్ ఆపలేమని, ఇది ఎటాకింగ్ మూడ్, ఇక దూకుడు ఆగదని, సమాధానం చెప్పేందుకు సిద్ధం, చర్చకు వస్తారా? రండి' అంటూ మోదీ సవాల్ విసిరారు.
మధ్యప్రదేశ్‌లోని ఒక అధికారి ఇంట్లో మంచం క్రింద రూ.3 కోట్లు పట్టుబడ్డాయని, ఈ సొమ్ము ఎవరిదని ప్రశ్నించారు. ‘‘మీకు అవినీతి అవసరమా?’’ అని ప్రజలను ప్రశ్నించారు. అందుకే తనకు ఒకే ఉపాయం తోచిందని, రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేశామని గుర్తు చేశారు. పేదలు, ధనవంతులు సమానం అయ్యారా? లేదా? అని ప్రశ్నించారు. తాను పేదల కష్టాలను అర్థం చేసుకోగలనని, అందరికీ అండగా ఉంటానని, చేయవలసినదంతా చేస్తానని స్పష్టం చేశారు.
ఉగ్రవాదులకు, నక్సలైట్లకు భారీ ధనరాశులు ఎక్కడి నుంచి వస్తున్నాయని అడిగారు. సరిహద్దుల ఆవలి నుంచి శత్రువులు నిధులు పంపిస్తున్నారన్నారు. వారందరిపైనా యుద్ధం చేయడానికి పెద్ద నోట్లు రద్దు చేయాలా? వద్దా? అని ప్రశ్నించారు. సామాన్యులు నకిలీ, అసలు నోట్ల మధ్య తేడాను తెలుసుకోగలరా? అని అడిగారు. పిల్లల పెళ్ళిళ్ల కోసం దాచుకున్న సొమ్ముపై ఒక్క అధికారి కూడా కన్ను వేసే ప్రసక్తే లేదని ఆయన హామీ ఇచ్చారు.