దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉదయం ఏడోసారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ సమయంలో ఆయన ముఖానికి మాస్క్ ధరించలేదు. కరోనాను కూడా లెక్క చేయకుండా ఆయన ధైర్యంగా వేడుకల్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈసారి... ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర స్వాతంత్ర దినోత్సవాలని నిరాడంబరంగా జరుపుతోంది.
కరోనా వైరస్ దృష్ట్యా సాదాసీదాగా జరపక తప్పట్లేదు. ప్రధానంగా మోదీ ఈసారి ఆత్మనిర్భర భారత్ అంశంపై మాట్లాడబోతున్నారు. తద్వారా... భారత్ స్వయం సమృద్ధి సాధిస్తూ... దేశీయ ఉత్పత్తుల్నే ప్రజలు వాడేలా చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. చైనాతో సరిహద్దు ఘర్షణ తర్వాత... కేంద్ర ప్రభుత్వం మేడ్ ఇన్ ఇండియా, మేకిన్ ఇండియాపై దృష్టి సారించింది. ఇక మోదీ దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు ప్రధాని మోదీ... బాపూ ఘాట్ దగ్గర... మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు.
అలాగే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 74సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన నివాసంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం ఎప్పుడైతే స్వావలంబన సాధిస్తుందో, అప్పుడే మనకు లభించిన స్వేచ్ఛకు నిజమైన అర్థం చేకూరుతుందన్నారు. అందువల్ల భారతదేశాన్ని స్వయం సమృద్ధి వైపు తీసుకువెళ్లడానికి మనమంతా ఈరోజు ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిచ్చారు.
ఇకపోతే.. ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ ఎర్రకోట వేడుకల్లో 350 మంది పోలీసులు మాత్రమే పాల్గొనబోతున్నారు. ఈసారి విద్యార్థులు పాల్గొనడం లేదు. కొద్దిమంది అతిథుల కోసం భౌతిక దూరంతో కుర్చీలు ఏర్పాటు చేశారు.
కొన్ని దేశాల దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులు, మీడియా ప్రతినిధులు, కరోనాను జయించిన పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వ అధికారులు... మొత్తంగా 4 వేల మంది మాత్రమే ఈసారి వేడుకల్లో పాల్గొనబోతున్నారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా... ప్రధాని మోదీ కోరిన ఆత్మ నిర్భర భారత్ దిశగా దేశ ప్రజలు అడుగులు వెయ్యాలని కోరారు.