Uttarkashi tunnel workers
ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ఇందులోంచి 41మంది కార్మికులు బయటపడ్డారు. నిర్మాణ దశలో ఉన్న సిల్క్యారా సొరంగం కూలడంతో 41 మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.
రెస్క్యూ ఆపరేషన్‌లో ఉపయోగించిన అధునాతన డ్రిల్లింగ్ యంత్రాలు కూడా విఫలమవ్వడంతో "ర్యాట్ హోల్ టెక్నిక్"ని ఉపయోగించి కార్మికులు కాపాడారు. ఎలాంటి అపాయం లేకుండా 41 మంది కార్మికులు బయటకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం అర్ధరాత్రి కార్మికులను ఫోన్‌లో పరామర్శించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు సిల్క్యారా సొరంగం నుంచి కార్మికులను రక్షించేందుకు 17 రోజులపాటు నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించిన సిబ్బందిపై ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు.
ఇదిలావుంచితే 41 మంది కార్మికులను కాపాడేందుకు 17 రోజులపాటు యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగించిన సిబ్బందిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మరీ ముఖ్యంగా ర్యాట్ హోల్ మైనర్స్పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.