Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"ఉత్తర భారత్ - దక్షిణ భారత్" అంటూ విభజన చేస్తే సహించం : ప్రధాని మోడీ

narendra modi

ఠాగూర్

, బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (16:29 IST)
ఉత్తర భారత్, దక్షిణ భారత్ అంటూ విభజన చేస్తే మాత్రం సహించబోమని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. కొందరు రాజకీయ నేతలు బాధ్యతా రాహిత్యంగా దేశాన్ని విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి విభజన కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన బుధవారం రాజ్యసభలో ప్రసంగించారు. ఉత్తరాది, దక్షిణాది.. మా రాష్ట్రం పన్నులు అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్న నేతలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొంతమంది మా రాష్ట్రం పన్నులు అంటూ మాట్లాడుతున్నారని, అసలు ఇదేం వితండవాదం అని ప్రశ్నించారు. దేశాన్ని విభజించే కుట్రలను సహించేది లేదన్నారు. వికసిత్ భారత్ కోసం మోడీ 3.0 అవసరమని ఆయన నొక్కి వక్కాణించారు. 
 
ఉత్తరాది, దక్షిణాది అంటూ నిధుల పంపిణీపై కొంతమంది నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కొందరు కావాలనే దేశాన్ని విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నిధులు అందిస్తామన్నారు. నిధుల కేటాయింపులో ఎలాంటి సంకుచితం లేదని, పారదర్శకంగా ఉంటామన్నారు. రాష్ట్రాలపై ఎలాంటి వివక్ష లేదన్నారు. అన్ని ప్రాంతాలను తాము సమానంగా చూస్తామన్నారు. పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు కాస్త ఎక్కువ నిధులు అవసరమవుతాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు. ఒక నది మా రాష్ట్రంలో ప్రవహిస్తుంది కాబట్టి మాకే.. బొగ్గు మా వద్దే ఉంది కాబట్టి మేమే వాడుకుంటాం, మా రాష్ట్రం పన్నులు, ఇలా మాట్లాడితే ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు. 
 
ఇండియా అంటే ఢిల్లీ ఒక్కటే కాదని ప్రధాని మోదీ అన్నారు. నా దేశం అంటే ఢిల్లీ మాత్రమే కాదు... బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కూడా అన్నారు. దేశం అంటే మట్టి కాదని... మన ఐక్యతకు చిహ్నమని వ్యాఖ్యానించారు. ఆయా రాష్ట్రాల అభివృద్ధికి రాష్ట్రాలు ఒక్క అడుగు వేస్తే తాము రెండు అడుగులు వేసేందుకు సిద్ధమని వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో ప్రపంచం మొత్తం ఓడినా మనం మాత్రమే గెలిచామని గర్వంగా చెప్పారు. కరోనా సమయంలో తాను ముఖ్యమంత్రులతో 20సార్లు సమావేశమయ్యానని గుర్తు చేశారు.
 
యువరాజు స్టార్టప్ నాన్ స్టార్టప్‌గా మిగిలిపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ చేశారు. రాహుల్ గాంధీని ఇప్పటికీ విజయవంతంగా లాంచ్ చేయలేకపోయారని చురక అంటించారు. యూపీఏ హయాంలో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు కేంద్రమంత్రులను కలవడానికి కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. గుజరాత్ రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు కుట్రలు చేశారని ధ్వజమత్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో బీజేపీకి షాక్ - పార్టీకి రాజీనామా చేసిన బాబు మోహన్