ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ అభివృద్ధి పథకాలను జాతికి అంకితం చేసేందుకు గురువారం చెన్నైకు వచ్చారు. స్థానిక పెరియమేడులోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్. రవి, కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్, సీఎం స్టాలిన్‌లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ ప్రసంగిస్తూ, కేంద్రం తీరును ఎండగట్టారు. పథకాలు ప్రారంభించి నిధులు ఇవ్వకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. ప్రధాని మోడీ ముందే తమిళ వాదాన్ని, ద్రవిడ వాదాన్ని పదేపదే బలంగా వినిపించారు. తమిళనాడులో తమళమే మాట్లాడుతామంటూ కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. అంతేకాకుండా ద్రవిడ మోడల్ పాలన యావత్ దేశానికి చూపిస్తామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రాలకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్రాలతో కేంద్రం కలిసి పని చేస్తే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. తమిళనాడుకు కేంద్రం ఇవ్వాల్సిన జీఎస్టీ నిధులను తక్షణమే విడుదల చేయాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. అలాగే, దేశాభివృద్ధిలో తమిళనాడు పాత్రను ముఖ్యమంత్రి గణాంకాలతో సహా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ చేసిన ప్రసంగం కంటే సీఎం స్టాలిన్ చేసిన ప్రసంగమే హైలెట్ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.