ట్రిపుల్ తలాక్‌పై రాజకీయాలొద్దు.. ఆ మహిళలు ఏం పాపం చేశారు: ప్రధాని మోడీ
దేశంలో తీవ్ర దుమారాన్ని రేపుతున్న ట్రిపుల్ తలాక్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఈ చట్టంపై రాజకీయాలొద్దంటూ ముస్లిం మత పెద్దలకు హితవు పలికారు. ముస్లిం సోదరీమణులు ఏం పాపం చేశారంటూ ఆయన ప్రశ్నిం
దేశంలో తీవ్ర దుమారాన్ని రేపుతున్న ట్రిపుల్ తలాక్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఈ చట్టంపై రాజకీయాలొద్దంటూ ముస్లిం మత పెద్దలకు హితవు పలికారు. ముస్లిం సోదరీమణులు ఏం పాపం చేశారంటూ ఆయన ప్రశ్నించారు. ట్రిపుల్ తలాక్ అంశాన్ని రాజకీయం చేయొద్దని పిలుపిచ్చారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని మహోబాలో సోమవారం జరిగిన మహా పరివర్తన్ ర్యాలీలో మోడీ ప్రసంగించారు. 'ఎవరైనా హిందువు ఆడ శిశువుల భ్రూణహత్యలకు పాల్పడితే జైలుకు వెళ్తాడు. మరి నా ముస్లిం సోదరీమణులు ఏం పాపంచేశారు? కొందరు ఫోన్లోనే తలాక్ చెప్పేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు' అని ఆవేదన చెందారు. మూడు సార్లు తలాక్ అంశాన్ని హిందూ - ముస్లిం సమస్యగా మార్చవద్దని టీవీ చానళ్లకు విజ్ఞప్తి చేశారు.
'మహిళలపై అత్యాచారాలు, అకృత్యాలు ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. మతం ఆధారంగా మహిళల పట్ల వివక్ష కూడదని కూడా తెలిపింది. ప్రజాస్వామ్యంలో చర్చ అవసరం. ప్రభుత్వం తన వైఖరిని తెలిపింది. మూడుసార్లు తలాక్ చెప్పి ముస్లిం మహిళల జీవితాలను నాశనం చేయడాన్ని అనుమతించం' అని ప్రధాని నరేంద్ర మోడీ తేల్చి చెప్పారు. ఈ 21వ శతాబ్దంలోనూ కొన్ని పార్టీలు ఓటుబ్యాంకు రాజకీయాల కోసం కూడా మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని సమర్థిస్తున్నాయని ఆక్షేపించారు.