Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మణిపూర్‌పై మాట్లాడమంటే... కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోసిన ప్రధాని మోడీ

modipm
, గురువారం, 10 ఆగస్టు 2023 (19:26 IST)
గత రెండు మూడు నెలలుగా ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో హింస, అల్లర్లు చెలరేగాయి. ఈ రాష్ట్రం తగలబడిపోతుంది. రెండు తెగలకు చెందిన ప్రజల మధ్య నెలకొన్న విద్వేషాలు ఒకరినొకరు చంపుకునే పరిస్థితి దారితీశాయి. దీంతో ఆ రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తి అట్టుడికిపోతుంది. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించాలంటూ గగ్గోలు పెడుతున్నాయి. అయినప్పటికీ ఆయన వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీ ఉందని తెలిసినప్పటికీ కేవలం మణిపూర్ అంశంపై ప్రధాని మోడీతో మాట్లాడించేందుకే ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్టు విపక్ష నేతలు అవిశ్వాసంపై జరిగిన చర్చ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం సభలో మాట్లాడిన ప్రధాని మోడీ... సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీపై నిప్పులు చెరిగారు. విశ్వాసం లేకనే అనేక రాష్ట్రాలు కాంగ్రెస్‌ పార్టీని తిరస్కరించాయని విమర్శించారేగానీ, మణిపూర్ హింసపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు మణిపూర్‌‍లో ఏమి జరగలేదన్నట్టుగా ఆయన ప్రసంగం సాగింది. 
 
'తమిళనాడు, బెంగాల్‌, త్రిపుర, ఒడిశా రాష్ట్రాల్లో దశాబ్దాలుగా కాంగ్రెస్‌ ఓడిపోతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లో ఒక్క శాసనసభ్యుడు కూడా లేరు. 'యూపీఏ' అనేది ఇప్పటికే ముగిసిన అధ్యాయం. 'ఇండియా' కూటమి అనేది.. మూలనపడ్డ ఆ బండి (యూపీఏ)కి రంగు వేయడం లాంటిదే. ఎన్ని రంగులు వేసినా.. పూతలెన్ని పూసినా.. ఆ బండి నడవదు. మిమ్మల్ని గెలిపించకపోవడం ప్రజల అపరాధం కాదు. మీరు చేసుకున్న కర్మ' అని మోడీ తీవ్ర స్థాయిలో విమర్శించారు.
 
జాతి నిర్మాణంలో వారసత్వ రాజకీయాలు అడ్డంకి అని తొలితరం మేధావులు చెప్పినదాన్ని కాంగ్రెస్‌ విస్మరించింది. కాంగ్రెస్‌ను వ్యతిరేకించిన మేధావులను కూడా ఆ పార్టీ ఓడించి చూపింది. కాంగ్రెస్‌ను ప్రశ్నించినందుకే బీఆర్‌ అంబేడ్కర్‌ను రెండుసార్లు ఎన్నికల్లో ఓడించింది. ఎమర్జెన్సీని ప్రశ్నించినందుకు జగ్జీవన్‌రామ్‌ను ఓడించింది. జయప్రకాశ్‌ నారాయణ్, మొరార్జీ దేశాయ్‌ వంటి ఎంతోమంది నాయకులను కాంగ్రెస్‌ ఓడించే ప్రయత్నం చేసింది.
 
'ఒకపెద్ద పేరుతో దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్నారు. వారి పని ఎక్కడా కనిపించదు. ఆస్పత్రుల పేర్లు, క్రీడా అవార్డుల పేర్లు, రహదారుల పేర్లు అన్నింటికీ వారివే. ఆస్పత్రికి వారి పేరు ఉంటుంది.. కానీ, చికిత్స దొరకదు. రహదారుల పేర్లు పెట్టుకుంటారు కానీ.. కొత్తవాటి నిర్మాణం ఉండదు. వారి పేరుతో అవార్డులుంటాయి.. కానీ, క్రీడాకారులకు ప్రోత్సాహం ఉండదు. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లు ఉంటుంది ఆ కుటుంబం వ్యవహారశైలి. ఆ కుటుంబం గురించి.. వాళ్ల అహంకారం గురించి చెప్పాలంటే చేంతాడంత ఉంది. ఇతరుల కష్టాన్ని, విజయాలను ఖాతాలో వేసుకోవడం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య. 1920 నుంచి ఇదే కథ. మూడు రంగుల జాతీయ జెండాను.. కాంగ్రెస్‌ జెండాగా మార్చుకుంది. ఎన్నికల గుర్తులను కూడా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వచ్చింది.
 
ఎన్‌డీఏకు రెండు 'ఐ'లు అదనంగా చేర్చి ఇండియా పేరుతో మళ్లీ 16 పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి. ఆ పార్టీల నేతలు రాష్ట్రాల్లో కలహించుకుంటారు.. ఇక్కడకు వచ్చి కలిసిపోతారు. మీ చర్యలు, మీ చేష్టలను యావత్‌ దేశం గమనిస్తోంది. ఇది ఇండియా సంకీర్ణం కాదు.. అహంకార పూరితమైనది. ఇందులో ప్రతి ఒక్కరూ ప్రధాని కావాలనుకుంటారు. 21 రాష్ట్రాల్లో ఒక్కోచోట ఒక్కోరకంగా ఈ పార్టీల సంకీర్ణం ఉంటుంది. ఎన్ని కొత్త జట్లు కట్టినా.. ఓటమి ఖాయం అని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హవాయి దీవిలో మంటలు: 36 మంది మృతి.. పలు ఇళ్లు దగ్ధం